రాజకీయ పార్టీలతో సమావేశమైన ఎస్ఈసీ .. టీడీపీ- బీజేపీ - జనసేన డుమ్మా !

Update: 2021-04-02 07:24 GMT
ఏపీ కొత్త ఎస్ ఈసీ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో నేడు రాజకీయ పార్టీలతో సమావేశమై పరిషత్ ఎన్నికల అంశం పై భేటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను తీసుకోవడం కోసం ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. దీనికి అధికార వైసీపీతో పాటు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు హాజరు కాగా.. విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బహిష్కరించాయి.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై న్యాయస్ధానాల్లో కేసులు పెండింగ్‌ లో ఉన్న నేపథ్యంలో పాత నోటిఫికేషన్‌ తో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎస్ ఈ సీ నీలం సాహ్నీ నిన్న షెడ్యూల్‌ విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 8న పోలింగ్‌, 10న కౌంటింగ్‌ జరగనున్నాయి. దీనిపై విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన భగ్గుమన్నాయి. ఇవాళ రాజకీయ పార్టీలతో భేటీకి పిలిచి ఆ లోపే నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఆ పార్టీలు తప్పుబట్టాయి. ఈ కారణంతో ఎస్ ఈసీ నిర్వహిస్తున్న భేటీకి  డుమ్మా కొట్టాయి. వైసీపీ తరఫున లేళ్ల అప్పిరెడ్డి, సీపీఎం తరఫున వైవీ రాఘవులు కాంగ్రెస్‌ నుంచి మస్తాన్ వలీ ఈ భేటీకి హాజరయ్యారు.

 ఏపీలో గతేడాది కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందే పలు ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయి. ఇందులో వైసీపీ అధికారబలంతో పలు చోట్ల ఏకగ్రీవాలు చేయించుకుందని విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన ఆరోపణలు చేస్తుంది. ఇదే క్రమంలో గత ఎస్ ఈ సీకి కూడా పాత నోటిఫికేషన్ ‌తో ఎన్నికలు వద్దని కోరిన ఆయా పార్టీలు కొత్త నోటిఫికేషన్ కోసం పట్టుబట్టాయి. ఇదే అంశంపై జనసేన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై తీర్పు పెండింగ్ ‌లో ఉండగానే ఎస్ ఈసీ పాత నోటిఫికేషన్‌ తో ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చారు. దీనితో ఆ విపక్ష  పార్టీలు ఎన్నికలపై నిర్వహిస్తున్న ఎస్ ఈసీ భేటీని బహిష్కరించాయి.
Tags:    

Similar News