తెలంగాణ సచివాలయమా.. టీఆర్ ఎస్ ఆఫీసా?

Update: 2015-12-01 04:13 GMT
సచివాలయం అంటే.. తెలంగాణ ప్రభుత్వ కార్యనిర్వహణకు సంబంధించిన ప్రాంతం. ఇక్కడ.. రాజకీయాలు ఉన్నా.. అవన్నీ వేరు తీరులో ఉంటాయే తప్ప.. పార్టీ కార్యాలయాల్లో కనిపించే హడావుడి ఉండదు. కార్యదర్శులు.. ఐఎఎస్ లు.. గ్రూప్ 1 అధికారులతో పాటు.. పెద్ద ఎత్తున ఉద్యోగులు.. పనులు చేయటానికి.. చేయించుకోవటానికి వచ్చే వారితో పాటు.. మీడియా ప్రతినిధులు.. రాజకీయ నేతల్ని కలుసుకునేందుకు వచ్చే సందర్శకులతో హడావుడిగా ఉంటుంది.

ఇలా నిత్యం ఉండే వాతావరణానికి భిన్నమైన సీన్ ఒకటి సోమవారం తెలంగాణ సచివాలయంలో చోటు చేసుకుంది. వివిద పార్టీలకు చెందిన నేతలు.. అధికారపక్షం తీర్థం పుచ్చుకునే సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో హడావుడి చేయటం.. లేదంటే.. ప్రత్యేక వేదిక ఒకటి ఏర్పాటు చేసి.. తమ తాజా బలాన్ని ప్రదర్శించటం లాంటివి చేస్తుంటారు. తాజాగా మాత్రం అలాంటి వాటికి వేదిగా మారింది తెలంగాణ సచివాలయం. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా కుత్భుల్లాపూర్ మండలం బాచుపల్లికి చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తెలంగాణ అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

సహజంగా ఇలాంటి కార్యక్రమాల్ని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తుంటారు. పార్టీ ఆఫీసు అయినా.. సచివాలయం అయినా పెద్ద తేడా ఏముందని అనుకున్నారో.. లేక అనుకోకుండా జరిగిందో కానీ.. వివిధ పార్టీలకు చెందిన స్థానిక నేతలు పార్టీలో చేరే కార్యక్రమాన్ని సచివాలయంలో పూర్తి చేశారు. దీంతో.. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులతో పాటు.. వారికి మద్దతుగా నిలిచే కార్యకర్తల పుణ్యమా అని సచివాలయంలో కొత్త హడావుడి కనిపించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సచివాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చటం ఏమిటని పలువురు అగ్రహం వ్యక్తం చేస్తుంటే.. అసలు అదేం పెద్ద విషయం కాదని.. గతంలోనూ అలాంటివి చాలానే చోటుచేసుకున్నాయని.. కావాలని తమపై బురద జల్లటానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ తెలంగాణ అధికారపక్ష నేతలు మండిపడుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతల చేరిక పుణ్యమా అని.. సచివాలయం కాసేపు తెలంగాణ అధికారపక్ష పార్టీ ఆపీసులా మారిందన్న విమర్శ మాత్రం బలంగా వినిపించింది.
Tags:    

Similar News