ఆ ఫలితం తో కేసీఆర్ ఆశలు ఆవిరి..మంత్రికి షాక్ ఖాయమట..!

Update: 2019-05-14 15:34 GMT
 తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్.. లోక్‌ సభ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందస్తు విజయంతో లోక్‌ సభ ఎన్నికలకు సన్నద్ధం అవడానికి ఆ పార్టీకి ఎంతో సమయం దొరికింది. దీనికితోడు - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందుకే రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలపై ఆయన కన్నేశారు. మిత్రపక్షం ఎంఐఎం పార్టీ ఒక స్థానం గెలుచుకోవడం ఖాయం కావడంతో మిగిలిన సీట్లన్నింటినీ దక్కించుకోవాలన్న పట్టుదలతో ఆయన పని చేశారు. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే క్రమంలో అభ్యర్థుల ఎంపికపై చాలా రోజులు కసరత్తు చేసి - కొందరు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం కూడా ఇవ్వలేదు.

 పోలింగ్ తర్వాత ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించబోతున్నాం అని టీఆర్ ఎస్ అధినేతతో సహా ఆ పార్టీ నేతలంతా పదే పదే చెబుతున్నారు. కానీ, వారికి ఊహించని ఫలితాలు రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రస్తుత కేబినెట్‌ లో ఉన్న మంత్రికి కూడా షాక్ తగలబోతుందని గ్రేటర్ హైదరాబాద్‌ లో వార్తలు హల్‌ చల్ చేస్తున్నాయి. దీనికి కారణం నగర పరిధిలోని సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుండడమేని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ తో పోలిస్తే బీజేపీ తెలంగాణలో కొంచెం మెరుగ్గానే ఉంది. అందుకే గత డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కేవలం ఒకే సీటును గెలుచుకున్నప్పటికీ, ఓటింగ్ శాతం మాత్రం మెరుగుపరుచుకుంది. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో రిపీట్ చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది.

 గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన బీజేపీ సికింద్రాబాద్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడి నుంచి దత్తాత్రేయ విజయం సాధించారు. అయితే - ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీ ఆయనను పక్కన పెట్టే - ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్‌ రెడ్డికి అవకాశం కల్పించింది. ఇదే ఆ పార్టీకి కలిసొచ్చిందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అంబర్‌ పేటలో ఓటింగ్‌ సరళి ఆయనకు లాభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మాములుగానే నగరంలో బీజేపీకి కొంత పట్టు ఉంది. ముఖ్యంగా ఆ పార్టీకి పట్టున్న ముషీరాబాద్‌ - ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు సికింద్రాబాద్ పరిధిలోనే ఉన్నాయి. దీనికితోడు ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు సానుభూతి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 ఈ లెక్కలతో పాటు బీజేపీ చేయించిన సర్వేలోనూ కిషన్ రెడ్డి విజయం సాధించబోతున్నారని స్పష్టమైనట్లు తెలుస్తోంది. అందుకే సికింద్రాబాద్‌ ను బీజేపీ గెలవబోతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు - ఈ స్థానం నుంచి టీఆర్ ఎస్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ పోటీ చేస్తుండగా - కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిని పక్కనపెడితే... తలసాని సాయికిరణ్ మాత్రం ఇక్కడ విజయం కోసం ఎంతో శ్రమించారు. ఆయన తండ్రి కూడా కుమారుడికి సహకరించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ గెలుస్తుందని వార్తలు రావడం తలసాని కుటుంబాన్ని షాక్‌కు గురి చేస్తోంది. అదే జరిగితే కేసీఆర్ ఆశలు ఆవిరవడం కూడా ఖాయమనే కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News