8 ప్రాణాలు తీసిన సికింద్రాబాద్ ఫైర్ యాక్సిడెంట్ ఎందుకో తెలిస్తే షాకే

Update: 2022-09-14 05:30 GMT
సోమవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలోని ఎలక్ట్రిక్ బైకుల షోరూంలో అగ్నిప్రమాదం ఎనిమిది నిండు ప్రాణాల్ని తీసిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఘటన చోటుచేసుకున్నంతనే ఏడుగురు మరణించగా.. మరొకరు మంగళవారం మరణించారు. దీంతో.. మొత్తం ఎనిమిది మంది ఈ ఘటనలో మరణించారు. ఈ ప్రమాదం వెనుక అసలు కారణం ఏమిటి? ముందుగా ప్రచారంలోకి వచ్చిన విద్యుత్ షార్ట్ సర్క్యుటా? లేదంటే ఇంకేమైనా అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే షాకింగ్ నిజం బయటకు వచ్చింది.

275 గజాల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా ఆరు అంతస్తులు (సెల్లార్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులు) నిర్మాణంలో సెల్లార్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ అసెంబ్లింగ్ యూనిట్ ఉండగా.. గ్రౌండ్ ఫ్లోర్ లో షోరూంతో పాటు.. హోటల్ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. మిగిలిన నాలుగు అంతస్థుల్లో లాడ్జిని నిర్వహిస్తున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు పాటించకుండా భవనంలోని సెల్లార్ లో బ్యాటరీలను అసెంబుల్ చేసి.. వాటిని ఛార్జింగ్ పెట్టటంతో అవి కాస్తా పేలాయి. అలా మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే వ్యాపించాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున పేలిన బ్యాటరీలతో పాటు.. వాహనాలు దగ్ధం కావటంతో చాలా త్వరగా మంటలు వ్యాపించాయి.

అదే సమయంలో దట్టమైన పొగ అలుముకోవడం తో షోరూంలో పార్కు చేసిన 37 బైకులు కూడా కాలి బూడిద అయ్యాయి. బ్యాటరీల్లో వాడే లిథియం అయాన్ పేలుడుకు గురైనప్పుడు కార్బన్ మోనాక్సైడ్ సహా వందకు పైగా విష వాయువులు విడుదలవుతాయని.. దాని కారణంగా మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

బ్యాటరీల నుంచి వచ్చే విష వాయువులకు తోడుగా.. వాహనాలు కూడా కాలిపోవటంతో దట్టమైన పొగ.. విషవాయువులు కలిసి గాలిని పీల్చటంతో లాడ్జిలో ఉన్న ఎనిమిది మంది మరణానికి కారణంగా చెప్పొచ్చు.

సెల్లార్ షట్టర్ మూసి ఉండటం.. పొగ.. విష వాయువులు బయటకు వెళ్లే మార్గం లేక మెట్ల దారి గుండా పై అంతస్తుల్లోకి చేరాయి. వాటిల్లో బస చేసిన వారు పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎక్కువసేపు అక్కడే ఉండి విషవాయువులు పీల్చిన వారు మరణించగా.. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. సెల్లార్ లో అక్రమంగా బ్యాటరీ అసెంబ్లింగ్ యూనిట్ నిర్వహణను ఏ శాఖ వారు గుర్తించకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. అక్రమంగా నిర్మించిన భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులే కాదు.. ట్రేడ్ లైసెన్సు కూడా తీసుకోలేదని  చెబుతున్నారు.

అధికారుల అవినీతి.. నిర్లక్ష్యం.. సదరు భవన యజమాని కక్కుర్తి.. వ్యాపార ప్రయోజనాలు వెరసి.. ఈ ప్రమాదంతో ఏ మాత్రం సంబంధం లేని ఎనిమిది నిండు ప్రాణాలు బలి కావటానికి కారణంగా చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News