టీజీ డిమాండ్‌ కు పెరుగుతున్న నేతల మద్దతు!

Update: 2015-10-27 05:05 GMT
అమరావతి మీద చంద్రబాబు నాయుడు విపరీతమైన శ్రద్ధను కేంద్రీకరిస్తున్న కొద్దీ.. అటు రాయలసీమ - ఉత్తరాంధ్రకు చెందిన నాయకుల్లో ఆందోళన నెలకొంటున్న మాట వాస్తవం. క్రమంగా తాము మరింత వెనుకబాటుతనంలోకి కూరుకుపోతామేమో అనే భయం వారిలో ఎక్కువగా ఉంది. అయితే పదవుల్లో ఉన్న వారు చంద్రబాబు మనోభీష్టానికి వ్యతిరేకంగా పెదవి కదపడానికి కూడా భయపడుతున్నారు. అదే సమయంలో.. తనకు పదవీ లేదు గనుక.. పోయేదేమీ లేదు గనుక.. కర్నూలుకు చెందిన నాయకుడు టీజీ వెంకటేష్‌ మాత్రం ఎడాపెడా తన డిమాండ్లను వినిపించేస్తున్నారు. తాజాగా ఈరెండు ప్రాంతాల అభివృద్ధికి, సీమ పరిస్థితి మరీ దారుణంగా అయిపోకుండా ఉండడానికి ఆయన చేసిన కొన్ని సూచనలకు సీమనేతలు అందరి దగ్గరినుంచి మద్దతు లభిస్తోంది.

అమరావతి మీద ప్రేమ.. ఉత్తరాంధ్ర - రాయలసీమలకు మరింత చేటు చేయకూడదనేది టీజీ వాంఛ. అందుకు అనుగుణంగా రాయలసీమలో సమ్మర్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేయాలని ఆయన కోరుతున్నారు. అలాగే ఉత్తరాంధ్ర - రాయలసీమ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలకంటె కూడా ఎక్కువగా వెనుకబడి ఉన్నాయని, వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్రధానిని డిమాండు చేయాల్సి ఉన్నదని టీజీ కోరుతున్నారు. అలాగే అమరావతిని ఫ్రీజోన్‌ చేయాలని కూడా టీజీ వెంకటేష్‌ అంటున్నారు.

నిజానికి వెనుకబడ్డ ప్రాంతాల దృష్టికోణం లోంచి ఆలోచించినప్పుడు.. ఈ డిమాండ్లు చాలా సమంజసంగానే ఉన్నాయి. అందుకే కాబోలు.. తెలుగుదేశం పార్టీలోనే రాయలసీమకుచెందిన అనేక మంది నాయకులు, ఎమ్మెల్యేలు కూడా టీజీ డిమాండ్లను బలపరుస్తున్నారని.. సరైన అంశాలను లేవనెత్తినట్లుగా ఆయనకు ఫోను చేసి అభినందిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేకంగా ఏదైనా ప్యాకేజీ అంటూ ఉంటే తప్ప రాయలసీమ అన్యాయం అయిపోక తప్పదనే విషయంలో ఎవ్వరికీ ఎలాంటి భిన్నాభిప్రాయమూ లేదు. అయితే ప్యాకేజీ కోరాల్సిందిగా చంద్రబాబు మీద ఒత్తిడి తేగల స్థితిలో సీమనేతలు గానీ, ఉత్తరాంధ్ర నేతలు గానీ ఎవ్వరూ లేకపోవడం శోచనీయం. స్వయంగా చంద్రబాబునాయుడు రాయలసీమకు చెందిన నాయకుడే అయినప్పటికీ.. మొత్తం సీమకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఆయన ఇలాంటి సూచనల పట్ల సానుకూలంగా స్పందిస్తారా లేదా అనేది వేచిచూడాలి.
Tags:    

Similar News