ఒక్కరోజులో ఎంతమంది తిరిగి వస్తారంటే..?

Update: 2016-01-16 05:00 GMT
సీమాంధ్రులు అతి పెద్ద పండగగా జరుపుకునే సంక్రాంతి సందడి దాదాపు ముగిసినట్లే. ముఖ్యమైన సంక్రాంతి పండగ పూర్తి అయిపోయింది. అయితే.. ఈసారి ఉద్యోగులకు కలిసి వచ్చేలా పండగ వచ్చింది. శుక్రవారం సంక్రాంతి రావటం.. శని.. ఆదివారాలు చాలా ఆఫీసులకు సెలవులు ఉండటంతో.. సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంది. పెద్ద పండక్కి ఏపీకి వెళ్లిన వారు ఎంతమంది అన్న లెక్క ఆసక్తికరంగా మారింది.

ఒక అంచనా ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లిన వారి సంఖ్య దాదాపు 20 నుంచి 25 లక్షల మంది ఉండొచ్చన్న అంచనా ఉంది. వీరిలో దాదాపు 15 లక్షల మంది ఒక్క హైదరాబాద్ నుంచే ఆంధ్రాకు వెళ్లినట్లుగా లెక్క వేస్తున్నారు. రైలు.. బస్సు ప్రయాణాల లెక్కను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ సంఖ్యను చెప్పొచ్చు. అయితే.. ఇంత భారీగా ప్రజలు ఒకట్రెండు రోజుల్లో వెళ్లకుండా.. ఒక క్రమ పద్ధతిలో వెళ్లటం గమనార్హం.

పిల్లల స్కూళ్లకు సెలవులు మొదలైన నాటి నుంచి ఊళ్లకు ప్రయాణాలు కావటం షురూ అయ్యింది. ఈ నెల 10 నుంచి సొంతూళ్లకు ప్రయాణాలు మొదలైతే.. బుధ.. గురువారాల్లో పీక్ స్టేజ్ కి చేరుకుంది. మరి..ఇన్ని లక్షల మంది తమ సొంతూళ్లకు ప్రయాణమైన నేపథ్యంలో.. వారు ఎప్పుడు తిరిగి వస్తారన్నది చూస్తే.. అత్యధికులు ఆదివారం రాత్రికి.. సోమవారం తెల్లవారు జాముకు చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో.. సొంతూళ్లకు వెళ్లిన వారంతా ఒకేరోజు తిరిగి రానున్న పరిస్థితి. దీంతో.. తిరుగు ప్రయాణం పెద్ద ఇబ్బందిగా మారింది. దాదాపు 15 లక్షల మంది ఒకపూటలో హైదరాబాద్ కు తిరిగి వచ్చేయటమంటే.. రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.
Tags:    

Similar News