కాంగ్రెస్‌ నేతలకు బుద్ధుందా!?

Update: 2015-06-24 17:30 GMT
కాంగ్రెస్‌ నాయకులకు మరీ ముఖ్యంగా సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులపై సీమాంధ్రులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులు అయితే వారి పేరెత్తితేనే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు మరింత దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. సెక్షన్‌ 8 విషయంలో సీమాంధ్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులకు ఏమాత్రం అయినా బుద్ధి ఉందా అని తీవ్రంగానే విరుచుకుపడుతున్నారు.

ఓటుకు నోటు వివాదం, ఫోన్‌ ట్యాపింగ్‌తోపాటు సెక్షన్‌ 8 విషయాన్ని కూడా సీమాంధ్ర నాయకులు రాజకీయ కోణంలోనే చూస్తున్నారని హైదరాబాద్‌లోని సీమాంధ్రులు మండిపడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబును ఎలా ఇరుకున పెట్టాలా అని ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు తప్పితే ఇక్కడి సీమాంధ్రుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్‌ 8 తెరపైకి వచ్చిన వెంటనే తెలంగాణలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలన్నీ ఒక్కటైపోయాయని, అంతా కలిసి మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారని, కానీ సీమాంధ్ర పార్టీల్లో ఈ వివేకం కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓటుకు నోటు వివాదంలో చంద్రబాబును ఇరుకున పెట్టేలా రాజకీయ కోణంలో మాట్లాడడంలో తప్పు లేదని, కానీ ఫోన్‌ ట్యాపింగ్‌, సెక్షన్‌ 8 విషయాల్లోనూ అదే వైఖరిని అవలంబించడాన్ని వారు తప్పుపడుతున్నారు. వాస్తవానికి, సెక్షన్‌ 8ని కాంగ్రెస్‌ పార్టీయే బిల్లులో పెట్టిందని, దానిని ఇప్పుడు అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కూడా డిమాండ్‌ చేయడానికి బదులుగా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌తోపాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూడా ఈ విషయంలో డిమాండ్‌ చేయడం లేదని, ఆ పార్టీ కూడా కేసీఆర్‌కు అనుకూలంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తోందని మండిపడుతున్నారు.

రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో పర్యటించిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు కాంగ్రెస్‌ పార్టీయే అండ అని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని సీమాంధ్రులకు పిలుపు ఇచ్చారని, అంతలోనే సెక్షన్‌ 8 విషయంలో సీమాంధ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తప్పుబడుతున్నారు. కాంగ్రెస్‌ నాయకుల ద్వంద్వ వైఖరిని చూసిన తర్వాత ఆ పార్టీకి ఓటు ఎందుకు వేస్తారని ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద, సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులైనా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులైనా హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని, మొత్తంమీద కాంగ్రెస్‌ పార్టీయే సీమాంధ్రుల శత్రువుగా మారిందని స్పష్టం చేస్తున్నారు.


Tags:    

Similar News