హెచ్‌1బీపై ట్రంప్ మొండిప‌ట్టుకు కార‌ణ‌మిది

Update: 2017-03-09 13:42 GMT
వ‌ల‌స విష‌యంలో ముఖ్యంగా హెచ్‌1బీ - గ్రీన్ కార్డ్ విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్  ఎందుకు క‌ఠినంగా ఉంటున్నారో రిప‌బ్లిక‌న్ సెనేట‌ర్ టామ్ కాట‌న్ ఆస‌క్తిక‌రంగా వెల్ల‌డించారు. తాము ప్ర‌వేశ‌పెట్టిన ఇమ్మిగ్రేష‌న్ బిల్లుపై ట్రంప్‌ తో చ‌ర్చించేందుకు మ‌రో సెనేట‌ర్ డేవిడ్ ప‌ర్‌ డ్యూతో క‌లిసి వైట్‌ హౌజ్ వెళ్లారు కాట‌న్‌. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హెచ్‌-1బీ వీసా - గ్రీన్‌ కార్డ్ కేట‌గిరీలు అనుకున్న ఫ‌లితాలు సాధించ‌డం లేద‌ని అన్నారు. పీహెచ్‌ డీల‌ను తీసుకురావాల్సిన ఈ కేట‌గిరీలు.. కేవ‌లం మిడ్ లెవ‌ల్ వ‌ర్క‌ర్స్‌ నే తీసుకొస్తున్నాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. హెచ్-1బీ వీసాల కింద అమెరికాకు పీహెచ్‌ డీ స్థాయి విద్యార్థులేన‌ని  కాటన్ స్పష్టంచేశారు. అందుకే ట్రంప్ హెచ్‌-1బీ వీసా సంస్క‌ర‌ణ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

అమెరికాలో ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న‌ వ్య‌వ‌స్థ ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ నైపుణ్యాన్ని తీసుకురావ‌డంలో పూర్తి విఫ‌ల‌మైంద‌ని టామ్ కాట‌న్‌ అన్నారు. హెచ్‌-1బీ తాత్కాలిక వీసాల విష‌యంలోనే కాదు ఈబీ1 - ఈబీ2లాంటి గ్రీన్‌ కార్డ్స్ కేట‌గిరీల్లోనూ ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ వ‌ర్క‌ర్స్ అమెరికా రావాల‌ని ట్రంప్ కోరుకుంటున్నారు. కానీ ప్ర‌స్తుతం ఇవి అనుకున్న ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చ‌డం లేదు అని కాట‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. హెచ్‌1బీ - ఈబీ1 - ఈబీ2 వంటివి పీహెచ్‌ డీల‌ను - కంప్యూట‌ర్ సైంటిస్టుల‌ను తీసుకురావ‌డం లేదు. మిడ్ లెవ‌ల్ వ‌ర్క‌ర్స్‌ ను తీసుకొస్తున్నారు. ఆ లెవ‌ల్ వారినే రీప్లేస్ చేస్తున్నారు. అందుకే డిస్నీ - స‌ద‌ర్న్‌ కాలిఫోర్నియా ఎడిస‌న్‌ లాంటి కంపెనీల్లో త‌మ ఉద్యోగాలు పోతున్నాయ‌ని స్థానికులు గొడ‌వ‌కు దిగ‌డంలాంటి వివాదాలు త‌లెత్తుతున్నాయి అని కాట‌న్ చెప్పారు. అందుకే ట్రంప్ ఈ కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల‌ని అనుకుంటున్నార‌ని తెలిపారు. అమెరిక‌న్లు చేయ‌లేని ఉద్యోగ‌మంటూ ఏదీ లేద‌ని, స‌రైన వేత‌న‌మిస్తే ఏ ప‌ని చేయ‌డానికైనా వారు సిద్ధంగా ఉంటార‌ని కాట‌న్ అన్నారు. అమెరిక‌న్ల‌కే ఎక్కువ ఉద్యోగాలు ద‌క్కేలా చేయ‌డ‌మే త‌మ లక్ష్య‌మ‌ని స్ప‌ష్టంచేశారు.

కాగా, త‌మ కొత్త బిల్లు  అత్యుత్త‌మ నైపుణ్యం ఉన్న‌వారే అమెరికాలో అడుగుపెట్టేలా రూపొందించిన‌ట్లు కాట‌న్ చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌తి 15 మంది వ‌ల‌స‌దారుల్లో ఒక్క‌రు మాత్ర‌మే ఇలా ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. మెరిట్ బేస్‌ డ్ ఇమ్మిగ్రేష‌న్ వ్య‌వ‌స్థ దిశ‌గా త‌మ బిల్లు తొలి అడుగ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. కాట‌న్ ప్ర‌వేశ‌పెట్టిన ఈ బిల్లు పాసైతే...వ‌ల‌స‌దారుల సంఖ్య రానున్న సంవ‌త్స‌రాల్లో భారీగా త‌గ్గిపోనుంది. వీసా లాట‌రీల‌ను ర‌ద్దు చేయాల‌ని, గ్రీన్‌ కార్డుల‌ను ఏడాదికి 50 వేలు మాత్ర‌మే జారీ చేయాల‌న్న నిబంధ‌న‌లు ఈ కొత్త బిల్లులో ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News