నవ్యాంధ్ర ఫిలించాంబర్ లో అప్పుడే కేసులు

Update: 2017-03-29 08:12 GMT
రాష్ర్ట విభజన తరువాత అధికారమో, అనధికారమో తెలియదు కానీ నవ్యాంధ్ర ఫిలించాంబర్ ఒకటి ఏర్పడింది.  ఇప్పుడు ఆ ఫిలించాంబర్లో మోసాలు, వేషాలు, గొడవలు, కేసులు మొదలయ్యాయి. తాజాగా టీడీపీ నేత, మాజీ నటి కవిత ఈ ఫిలిం చాంబర్ అధ్యక్షుడిపై కేసు పెట్టారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారంటూ  నవ్యాంధ్రప్రదేశ్‌  ఫిలించాంబర్‌ అధ్యక్షుడు ఎస్‌వీఎన్‌.రావుపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ  కవిత బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
    
ఈ సందర్భంగా ఆమె ఫిలిం చాంబర్ ఏర్పాటు మొదలు ఏమేం జరిగాయో.. తన పేరును వాడుకుని మోసాలకు ఎలా పాల్పడ్డారో అంతా వివరించారు. గతంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పని చేసిన ఎస్‌వీ.ఎన్‌.రావు రాష్ట్ర విభజన తర్వాత బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని నవోదయ కాలనీలో తానే అధ్యక్షుడిగా నవ్యాంధ్రప్రదేశ్‌ ఫిలించాంబర్‌ కార్యాలయం తెరిచాడన్నారు. ఇందులో  పలువురు నిర్మాతలు, దర్శకులు, ఔత్సాహికులను సభ్యులుగా చేర్చుకొని డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. తనకు తెలియకుండానే ఆ  సంస్థకు తనను వైస్‌ ప్రెసిడెంట్‌గా  నియమించాడని, అయితే ఈ సంస్థకు ఎలాంటి హక్కులు లేవని తెలుసుకొని తాను రాజీనామా చేసేశానని ఆమె చెప్పారు.
    
అయితే... తన రాజీనామా ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని తాను అంగీకరించకపోవడంతో మూడు రోజులుగా ఫేస్‌బుక్‌లో తనపై దుష్ప్రచారం చేస్తూ కరపత్రాలు పెట్టినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంతులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయతో ఉన్న పరిచయాలను వినియోగించి నవ్యాంధ్రప్రదేశ్‌ ఫిలించాంబర్‌కు హక్కులు కల్పించాల్సిందిగా కోరగా అందుకు తాను అంగీకరించలేదన్నారు. తాను కారు అడిగినట్లు కూడా ఫేస్‌బుక్‌లో ప్రచారం చేశారని ఆరోపించారు. గుంటూరులో బుధవారం ఫిలించాంబర్‌ కార్యాలయాన్ని తెరవబోతున్నాడని, సంస్థకు సీఎం ఆశీస్సులు ఉన్నాయని నమ్మిస్తూ డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ స్వయం ప్రకటిత ఛాంబర్ లో ఏదో మతలబు ఉన్నట్లే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News