హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

Update: 2022-01-22 23:30 GMT
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చూపించారు. వీరిలో 10 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు ఇతర సహాయకులను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీతోపాటు ముఠా సభ్యులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్న 10 మంది కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

మహ్మద్ ఆసిఫ్, షేక్ మహమ్మద్, సాహిద్ ఆలం, ఆఫ్తాబ్, రెహమత్, ఇర్ఫాన్, ఇమ్రాన్, సోమ శశికాంత్ , గజేంద్ర ప్రకాష్,సంజయ్, అశోక్ జైన్ లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మత్తు మందుకు బిగ్ షాట్స్, పెద్ద పెద్ద వ్యాపారులు కస్టమర్లుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ బిజినెస్ మెన్ లు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ముంబై డ్రగ్స్ మాఫియాకు చెందిన టోనీతో వ్యాపారవేత్తలు డ్రగ్స్ తెప్పించుకున్నారు. ఈ కేసులో పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ ఆనంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1 కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశ్వత్ జైన్, కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, ప్రముఖ వ్యాపారి వెంకట్ చలసానిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇక హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న ఏడుగురు సంపన్న కుటుంబాలకు చెందిన వారి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరికి గతంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తేలింది.

1000 కోట్ల ఆస్తి ఉన్న ప్రముఖ డిటెర్జెంట్ సబ్బుల కంపెనీ అధినేత శాశ్వత్ జైన్  కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉండడం విస్తు గొలుపుతోంది. కౌన్సిలింగ్ చేసినా అతడిలో మార్పు రాలేదు. వీరికో 600 కోట్ల పెద్ద కన్ స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది.  గౌలిపురకు చెందిన యజ్ఞానంద్ అగర్వాల్ కుటుంబం మసాలా దినుసల వ్యాపారంలో ఉంది. ఇలా బడా వ్యాపారులే ఈ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో ఉండడం కలకలం రేపుతోంది.
Tags:    

Similar News