యూపీలో ఈ సెంటిమెంటు గట్టెక్కిస్తుందా ?

Update: 2022-01-27 05:30 GMT
తొందరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇపుడీ సెంటిమెంటుపైనే పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ ఆ సెంటిమెంటు ఏమిటంటే యూపీలోని దళితులకు రిజర్వ్ చేసిన సీట్లలో అత్యధికంగా ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీదే అధికారమట. అందుకనే సెంటిమెంటును కొల్లగొట్టడంలో భాగంగా దళితుల ఓట్ల కోసమే అన్నీ పార్టీలు నానా అవస్థలు పడుతున్నాయి. యూపీలోని మొత్తం 403 సీట్లలో 84 సీట్లు దళితులవి కావటమే ఇక్కడ కీలకమైపోయింది.

 ఒకసారి చరిత్రను చూస్తే 2007లో బీఎస్పీ 61 స్ధానాలను గెలుచుకోవటంతో అధికారంలోకి వచ్చింది. 2012లో ఎస్పీ 58 నియోజకవర్గాల్లో గెలవటంతో అధికారాన్ని అందుకుంది. ఇక 2017లో బీజేపీ ఏకంగా 70 నియోజకవర్గాల్లో గెలుచుకుని తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. అంటే చరిత్ర ప్రకారం చూస్తే మినిమం 58 సీట్లను ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పవచ్చు.

 అందుకనే మొన్నటి ఎన్నికల్లో జరిగిన మ్యాజిక్ ను తిరిగి సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో తన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చాలా కష్టపడుతున్నారు. నిజానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి కనుక యాక్టివ్ గా ఉండుంటే ఈ పాటికి యూపీ ఎన్నికల్లో మంటలు మండుతుండేవి. కానీ ఎందువల్లో మాయావతి చాలా సైలెంట్ అయిపోయారు. అందుకనే మిగిలిన పార్టీలు కానీ మీడియా సంస్ధలు కానీ బీఎస్పీని పెద్దగా లెక్కలోకి తీసుకోవటం లేదు.

 మామూలుగా అయితే దళితుల్లో మెజారిటీ సెక్షన్ బీఎస్పీకే మద్దతుగా నిలబడతారు. కానీ ప్రస్తుతం మాయావతి స్ట్రాటజీ ఏమిటో తెలీని కారణంగా దళితుల ఓట్లు ఎవరికి పడతాయో అర్థం కావటం లేదు. దళితుల్లో అత్యధికులైన జాతవ్ లు బీఎస్పీతో ఉన్నారు. మిగిలిన దోబీ, భాటక్, వాల్మీకిలు మాత్రం అటు ఇటు మారుతుంటారు. కానీ ఇపుడు జాతవ్ లు కూడా చెల్లాచెదురైపోయినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం దళితులకు ఆరోగ్య సంరక్షణ, పక్కా గృహాలు, మరుగుదొడ్లు, సబ్సిడీ సౌకర్యాలను కల్పిస్తోంది. మరి చివరకు ఏమవుతుందనే టెన్షన్ మాత్రం పెరిగిపోతోంది.
Tags:    

Similar News