సెంటిన‌లీస్ తెగ‌..కొన్ని సంచ‌ల‌న నిజాలు

Update: 2018-11-26 12:45 GMT
అమెరికన్ పర్యాటకుడు జాన్ అలెన్‌ చౌ (27) అండమాన్‌ లోని సెంటినల్ తెగ ఆదివాసీల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఉదంతం దేశ‌ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మృతదేహం దొరికే ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. సముద్ర తీరంలో ఎక్కడో ఒక చోట పాతిపెట్టిన అతడి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మేరకు శనివారం ఓ బోట్‌ లో పోలీస్ బృందం అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించింది. సముద్రంలోనే తీరానికి 400 మీటర్ల దూరంలో బోటును నిలిపివేసి అక్కడి పరిస్థితిని బైనాక్యూలర్స్ ద్వారా పోలీసులు గమనించారు. అయితే, ఆదివాసీలు బాణాలు ఎక్కుపెడుతూ సముద్రం వైపునకు రావడాన్ని వారు చూశారు. దీంతో వారితో ఘర్షణను నివారించేందుకే పోలీసులు వెనక్కి వచ్చేశారని అండమాన్ డీజీపీ దీపేంద్ర పాఠక్ తెలిపారు.

ఇదిలాఉండ‌గా - ఈ చ‌ర్య‌కు పాల్ప‌డిన సెంటిన‌లిస్ తెగ గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఏకాకిగా మిగిలిపోయిన తెగల్లో సెంటినెలీస్ ఒకటి. అత్యంత ప్రమాదకరమైన తెగ కూడా ఇదే. తాము నివసించే ఉత్తర సెంటినెల్ దీవి ఛాయలకు కూడా ఇతరుల్ని రానివ్వరు. ఇటీవలే అండమాన్ ప్రభుత్వం నిషేధిత ప్రాంతాల జాబితా నుంచి సెంటినల్ దీవిని తొలగించింది. దీంతో 2022 డిసెంబర్ 31వరకు ఎవరైనా అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలోనే జాన్ అలెన్ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించినట్లు తెలుస్తున్నది. అయితే - త‌మ పరిధిలోకి అనుమ‌తి లేకుండా వ‌చ్చార‌ని వారు చంపేసిన‌ట్లు స‌మాచారం. మరోవైపు జాన్‌ కు మతబోధనలకన్నా సాహస క్రీడలంటే ఆసక్తి అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. `మీ అందరికీ నేను పిచ్చివాడిని అనిపించొచ్చు. కానీ అండమాన్‌ లోని సెంటినలీస్ తెగ వారికి ఏసుక్రీస్తు గురించి చెప్పేందుకు ఇదే సమయం. ఒకవేళ నేను చనిపోయినా కోపం తెచ్చుకోవద్దు. వారిని నిందించవద్దు`` అని సెంటినలీస్ తెగ చేతిలో మరణించిన అమెరికన్ జాన్‌అలెన్ చౌ.. అండమాన్ పర్యటనకు ముందు తన కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పెట్టిన పోస్టులో కోరారు. జాన్ స్వచ్ఛందంగానే అక్కడికి వెళ్లినందున.. జాన్ హంతకులను తాము క్షమిస్తున్నామని - ఆ తెగ వారిని వేధించవద్దని మృతుడి కుటుంబీకులు కోరారు.

అండమాన్.. దీవుల సముదాయమేకాదు - ఆనేక ఆటవిక తెగల సమాహారం కూడా. ఇక్కడ ప్రధానంగా ఐదు తెగలు.. గ్రేట్ అండమానీస్ - జారవా - ఒంగెస్ - సెంటినెలీస్ - షోమ్‌ పెన్స్ ఉన్నాయి. ఈ ఆదిమ తెగల్లో కొన్ని ఆధునిక సమాజానికి చేరువలోనే ఉన్నా.. చాలా వరకు తెగలు మాత్రం బాహ్య ప్రపంచానికి దూరంగా తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. గ్రేట్ అండమానీస్ - ఒంగే - జారవా - సెంటినలీస్ నాలుగు నెగ్రిటో తెగలు.. 60వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు. భారత ప్రభుత్వం వీరిని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చింది. ప్రొటెక్షన్ ఆఫ్ అబొరిజినల్ ట్రైబ్స్ కింద వీరిని ప్రభుత్వం రక్షిస్తున్నది.

-గ్రేట్ అండమానీస్: వాస్తవానికి వీరంతా ఒకే తెగ కాదు. ఒకే ఆచారాలను పాటించే చిన్న చిన్న తెగలను కలిపి గ్రేట్ అండమానీస్‌ గా వ్యవహరిస్తారు. వీరిలో బలే - బియా - బో - జెరూ - జువోయ్ - కారి - కేడే - కోల్ - కోరా - పుసిక్వార్ తెగల వాసుల్ని గ్రేట్‌ అండమానీస్ అంటారు. వీరి జనాభా వందలోపే.

-షోమ్‌పెన్స్ - నికోబారీస్: షోమ్‌ పెన్స్ - నికోబారీస్ అనేవి మంగోలైడ్ తెగలు. ఇవి 55వేల సంవత్సరాల క్రితం మలయ్-బర్మా తీరం నుంచి వచ్చి అండమాన్‌ లో స్థిరపడ్డాయి. గ్రేట్ నికోబార్ ఐలాండ్‌ లో నివసించే ఈ తెగలో అత్యంత పురాతనమైనది. ప్రస్తుతం 380మంది షోంపెన్ తెగవాసులు మాత్రమే మిగిలారు. ఇక నికోబారీస్ ప్రధాన వృత్తి వ్యవసాయం.

-ఒంగెస్: లిటిల్ అండమాన్ దీవిలో ఉంటారు. అంతరించిపోతున్న అరు తెగల్లో ఒకటి. అడవుల విధ్వంసంతో వీరి జనాభా గణనీయంగా తగ్గి - ప్రస్తుతం 100మందికి చేరింది. ఈ తెగవాసులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తూ ఆహారాన్ని అందిస్తున్నది.

-జారవా/జంగిల్ తెగ: వీరి జనాభా ప్రస్తుతం 270గా ఉంది. వీరి దీవి గుండా హైవే నిర్మాణంతో ఈ తెగ జీవనం ప్రమాదంలో పడింది. ఇతరులెవరికీ హాని కలిగించకుండా ఉండే అహింసా ప్రవృత్తి వల్ల వీరి సంఖ్య తగ్గిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. చాలామంది పర్యాటకులు పోలీసులకు డబ్బులిచ్చి మరీ రుత్‌ లాండ్ దీవికి వెళ్లి వీరితో రోజంతా గడుపుతుంటారు. అండమాన్‌ లో నాగరిక ఛాయలకు ప్రభావితమైన ఏకైక తెగ ఇదే.

-సెంటినెలీస్: జారవా తెగవాసులకు వీరు పూర్తిగా భిన్నం. నాగరిక ప్రపంచానికి సుదూరంగా జీవించే సెంటినెలీస్ తెగ వ్యక్తులు తమ ద్వీపంలోకి కొత్త వ్యక్తులెవరినీ రానివ్వరు. ఎవరైనా వస్తున్నట్లు గుర్తిస్తే.. దాడి చేసేందుకు వారు వస్తున్నట్లుగా భావిస్తారు. తెగ అంతా కలిసి సామూహిక దాడికి దిగుతారు. సముద్రంలో చేపల వేటకు అనుగుణంగా వీరికి తీక్షణ దృష్టి అలవడింది. నీటిలో చేపల కదలికల్ని గమనిస్తూ బాణాలతో కొట్టి చంపగల సమర్థులువాళ్లు. ఈ తెగ జనాభా 40 నుంచి 400మంది వరకు ఉన్నట్లు అంచనా.

సెంటినలీలతో స్నేహం చేసిన ఘనత త్రిలోక్‌ నాథ్ పండిట్‌ దే. సామాజిక శాస్త్రవేత్తగా అండమాన్ ఆదివాసీల గురించి సుదీర్ఘ అధ్యయనం చేసిన ఆయన.. 1966 నుంచి 1991 వరకు ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరఫున పలుమార్లు ప్రాణాలకు తెగించి సెంటినల్ ద్వీపానికి వెళ్లాడు. ఆ ద్వీపంపై అడుగుపెట్టి - వారితో మాట్లాడిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచాడు. 1970లో మేం సెంటినల్ ద్వీపం వద్దకు వెళ్లినప్పుడు.. మమ్మల్ని చూసి వారంతా దూరంగా వెళ్లి మా వైపు వీపు చూపిస్తూ కూర్చున్నారు. దానర్థం.. మీతో మేం మాట్లాడేదేమీ లేదు. మీరు మాకు నచ్చలేదని చెప్పడమే. వారికి కొన్ని కొబ్బరి బోండాలను ఇస్తే తీసుకోలేదు. అక్కడ పెట్టేసి వచ్చేశాం అని పండిట్ ఓ బ్రిటిష్ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. అయితే పండిట్ అక్కడితో వదిలేయలేదు. 21 ఏండ్లపాటు వారి కోసం పలుమార్లు సెంటినల్ ద్వీపానికి వెళ్లి కొబ్బరికాయలు వంటివి ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. చివరకు 1991లో ఆయన ద్వీపానికి వెళ్లినప్పుడు.. ఓ డజను మంది సెంటినలీలు ఆయుధాల్లేకుండా ఆయన వద్దకు వచ్చారు. పండిట్‌ ను పరిచయస్థుడిగా వారు భావించారు. ఆయన ఇచ్చిన కొబ్బరికాయల్ని చేతుల నుంచి తీసుకున్నారు. 84 ఏండ్ల టీఎన్ పండిట్ ప్రస్తుతం ఢిల్లీలో శేషజీవితం గడుపుతున్నారు.
Tags:    

Similar News