నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం..

Update: 2021-12-10 05:30 GMT
నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం.. ఇప్పుడు మహా విషాదంగా మారింది. గురువారం రాత్రి నెల్లూరు- ముంబయి జాతీయ రహదారిపై వస్తున్న ఆటోను.. ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో.. ఆటో ఎగిరి బీరాపేరు వాగులో పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందిలో ఒకరు ఘటనా స్థలంలో మరణించగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. మిగిలిన ఏడుగురిలో ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు రాగా.. మరో నలుగురిని స్థానికులు.. పోలీసులు రక్షించారు.

పద్నాలుగేళ్ల నాగవల్లి అనే బాలిక ప్రమాదంలో మరణించింది. ఆటోలో ప్రయాణిస్తున్న పన్నెండు మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం గమనార్హం. ఆత్మకూరు జ్యోతినగర్ కు చెందిన నాగభూషణం కుటుంబం సంగంలోని సంగమేశ్వరాలయంలో నిద్ర చేసేందుకు ఆటోలో బయలుదేరారు. పన్నెండు మందితో బయలుదేరిన ఈ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఆటోను.. ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఒక దానికొకటి ఓవర్ టేక్ చేసే క్రమంలో వీరి ఆటోను ఒక లారీ ఢీ కొట్టింది.

ప్రమాద తీవ్రత ఎంతంటే.. వేగంగా వెళుతున్న లారీ ఒక్కసారిగా ఆటోను ఢీ కొట్టటంతో.. పన్నెండు మందితో ప్రయాణిస్తున్న ఆటో ఏకంగా 15 అడుగుల దిగువన ఉన్న వాగులో పడిపోయింది. ఆ వైపు వెళుతున్న స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్ని సమాచారం ఇచ్చారు. దీంతో.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన ఐదుగురు కోసం గాలిస్తున్నారు.
Tags:    

Similar News