ముషార్ర‌ప్ మార‌లేదు!... అఫ్రీదీ తోడ‌య్యాడు!

Update: 2019-02-20 17:07 GMT
పుల్వామా ఉగ్ర దాడిపై అన్ని వైపుల నుంచి నిర‌స‌న‌లు - ఒత్తిడులు ఎదుర‌వుతున్నా... పాకిస్థాన్ మాత్రం త‌న తీరు మార్చుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. త‌న భూభాగాన్నే కేంద్రంగా చేసుకుని భార‌త్ అల్ల‌క‌ల్లోలం సృష్టించేందుకు జైషే మొహ్మ‌ద్ లాంటి ఉగ్ర‌వాద సంస్థ‌లు చేస్తున్న దుశ్చ‌ర్య‌లు క‌ళ్లెదుటే క‌నిపిస్తున్నా కూడా పాక్ తన వైఖ‌రిని పునఃప‌రిశీలించుకునేందుకు ఏమాత్రం మొగ్గు చూప‌డం లేదు. అంతేకాకుండా అధికార, విప‌క్షాల‌న్న తేడా లేకుండా పాక్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా... మిగిలిన పార్టీల‌న్నీ కూడా భార‌త్ విష‌యానికి వ‌స్తే... ఒక్క‌టైపోతున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నంగానే పుల్వామా దాడి నేప‌థ్యంలో త‌మ‌పై భార‌త్ యుద్ధానికి దిగితే... తాము కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తామ‌ని చెప్పిన పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు పాక్ మాజీ అధ్య‌క్షుడు జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముషార్ర‌ప్ మ‌ద్ద‌తు ప‌లికారు. పుల్వామా దాడి త‌ర్వాత ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ముషార్ర‌ఫ్ త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌నం రేపారు.

పుల్వామా దాడిలో పాక్‌ ప్రమేయం ఉందంటూ ఇండియా చేస్తున్న ఆరోపణలను ఆయ‌న‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. పాక్ ప్రభుత్వంపై దుష్ప్రచారం వద్దని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. పాక్‌ను రెచ్చగొట్టదని వార్నింగ్ కూడా ఇచ్చారు. పుల్వామా దాడిని తాను ఖండిస్తున్నానని.. అయితే దాడికి పాక్‌ను నిదించడమే సరికాదని ఆయ‌న వ్యాఖ్యానించారు. దాడి జరిగిన గంటల్లోనే పాక్‌ను ఎలా తప్పుపడతారని ఆయన ప్రశ్నించారు. దాడికి తామే బాధ్యులమని జైషే ప్రకటించడంపై అడిగితే.. జైషేను పాక్ ఉపేక్షించదని, జైషేపై నిషేధం విధించాలన్నారు. జైషే చీఫ్ మసూద్‌పై తమకెలాంటి సానుభూతి లేదనీ ఆయ‌న కామెంట్ చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌రో సంచ‌ల‌న కామెంట్ చేసిన ముషార్ర‌ఫ్‌.. మసూద్ తనను కూడా చంపాలనుకున్నాడని బాంబు పేల్చారు. ఇక భార‌త్ యుద్ధానికే కాలు దువ్వితే న‌ష్ట‌పోయేది భార‌తేన‌ని,  ఐదు పాయింట్లలో నాలుగు చోట్ల తమ సైన్యాన్ని భారత దళాలు టచ్ కూడా చేయలేవని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ఇక పుల్వామా దాడి త‌ర్వాత పాక్‌పై అమెరికా ఆంక్ష‌ల అంశాన్ని కూడా ఆయ‌న కొట్టిపారేశారు.

ఇదిలా ఉంటే... ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ... ఆ దేశ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రీదీ మరోమారు వార్త‌ల్లోకెక్కాడు. క్రికెట్ మైదానంలో ఉన్న‌ప్పుడే భార‌త్ అంటే త‌న‌కు గిట్ట‌ద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన అఫ్రీదీ నుంచి ఈ త‌ర‌హా స్పంద‌న‌లో పెద్ద‌గా ఆశ్చ‌ర్యం లేకున్నా... ఓ క్రీడాకారుడిగా ఉంటూ ఈ వివాదంలోకి దిగ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త్ యుధ్దానికి దిగితే... త‌గిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగానే ఉన్న‌ట్లు ఇమ్రాన్ చేసిన ప్ర‌క‌ట‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన అఫ్రీదీ... ఇమ్రాన్ ప్ర‌సంగం ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. అంతేకాకుండా దానికి ఓ కామెంట్‌ను కూడా జ‌త చేసిన అఫ్రీదీ... *కచ్చితంగా క్రిస్టల్ & క్లియర్* అంటూ వ్యాఖ్యానించాడు. మొత్తంగా ఇమ్రాన్ తీరుకు ముషార్ర‌ఫ్ తో పాటు అఫ్రీదీ కూడా మ‌ద్ద‌తు తెలిపిన‌ట్టైంది.

ఇదిలా ఉంటే... పాక్ తీరును ఖండిస్తూ ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ మ‌రోమారు పాక్‌కు షాకిచ్చారు. జైషే చీఫ్ మసూద్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించాలంటూ భారత్ చేసిన డిమాండ్‌కు రష్యా తాజాగా మద్దతు తెలిపింది.  *మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా యూఎన్ భద్రతా మండలి ప్రకటించాలన్న ఇండియా వాదనకు మేము కచ్చితంగా మద్దతు తెలుపుతున్నాం. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు మా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం. ఉగ్రవాదానికి సంబంధించి ఇండియా చేస్తున్న వాదనకు మా మద్దతు తప్పనిసరిగా ఉంటుంది' అని రష్యా మంత్రి డెనిస్ మాంటురోవ్ ప్ర‌క‌ట‌న చేశారు.


Tags:    

Similar News