ఎవ‌రీ శ‌క్తికాంత దాస్‌? ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

Update: 2018-12-12 05:25 GMT
తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌లు.. వాటి ఫ‌లితాల కార‌ణంగా దేశంలో ఏం జ‌రుగుతుందో పెద్ద‌గా ప‌ట్టించుకోని ప‌రిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌డిచిన కొద్ది రోజులుగా ఎంత‌కూ కేసీఆర్‌కు వ‌చ్చే సీట్లు ఎన్ని?  కుక‌ట్ ప‌ల్లిలో సుహాసిని గెలుస్తుందా?  శేరిలింగంప‌ల్లిలో టీడీపీ విజ‌యం సాధిస్తుందా? అన్న క్వ‌శ్చ‌న్లే త‌ప్పించి మ‌రింకేమీ ప‌ట్ట‌లేదు.

దేశంలో చోటు చేసుకున్న పెద్ద పెద్ద ప‌రిణామాలేవీ ఎవ‌రూ ప‌ట్టించుకునే తీరికా.. ఓపికా లేని ప‌రిస్థితి. ఒంట్లో ఉన్న శ‌క్తి మొత్తం చంద్ర‌బాబును తిట్ట‌టానికి.. కేసీఆర్‌ను పొగ‌డ‌టానికి.. అదే తీరులో కేసీఆర్ ను తిట్ట‌టానికి.. బాబు గొప్ప‌లు చెప్పుకోవ‌టంలో బిజీబిజీగా ఉన్నారు. ఈ హ‌డావుడిలో వ‌చ్చిన రోబోను సైతం లైట్ తీసుకున్న ప‌రిస్థితి. మామూలు రోజుల్లో రోబో 2.0 రిలీజ్ అయి ఉంటే.. మీడియాలోనూ.. తెలుగు లోగిళ్ల‌లోనూ జ‌రిగే హ‌డావుడి అంతా ఇంతా కాద‌న్న‌ట్లు ఉండేది. కాకుంటే.. రాజ‌కీయ వేడిలో వేరే విష‌యాల్ని తెలుగు ప్ర‌జ‌లు అస్స‌లు ప‌ట్టించుకోని ప‌రిస్థితి.

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు పెద్ద‌న్న‌లా.. ర‌క్ష‌కుడిలా వ్య‌వ‌హ‌రించే ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ అనూహ్యంగా రాజీనామా చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. మోడీకి విధేయుడిగా పేరున్న ఆయ‌న ఉన్న‌ట్లుండి అంత తీవ్ర నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకున్న‌ట్లు? అన్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింది. ఇటీవ‌ల కాలంలో మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న విధానాలు.. ఆర్ బీఐ మీద తీసుకొస్తున్న ఒత్తిళ్ల‌తో పాటు.. కొన్ని ట‌చ్ కూడ‌ని అంశాల విష‌యంలోనూ మోడీ స‌ర్కారు జోక్యం అంత‌కంత‌కూ పెరిగిపోవ‌టంతో.. ఇలాంటి వాటికి సాగిల‌ప‌డే క‌న్నా.. తాము న‌మ్మిన ధ‌ర్మానికి త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌టం మేల‌న్న ఉద్దేశంతో అత్యంత కీల‌క స్థానానికి సింఫుల్ గా రాజీనామా చేసేసి సంచ‌ల‌నం సృష్టించారు ఉర్జిత్‌.

సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ఉర్జిత్ తీసుకున్న‌ప్ప‌టికీ  తెలుగు ప్ర‌జ‌ల‌తో పాటు.. ప‌లు రాష్ట్రాల వారు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీనికి కార‌ణం.. ఆయా రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌లే. ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ గా ఉర్జిత్ రాజీనామా చేసినంత‌నే ఆయ‌న స్థానంలో మ‌రొక‌రిని అపాయింట్ చేసేసింది మోడీ స‌ర్కారు. ఉర్జిత్ స్థానంలో శ‌క్తికాంత దాస్ అన్న పేరును అనౌన్స్ చేశారు. ఎక్క‌డో ఈ పేరు విన్న‌ట్లుందే అన్న భావ‌న ప‌లువురికి క‌లిగింది. ఆ వెంట‌నే ఆయ‌న ఫోటోల్ని చూసిన‌ప్పుడు అంద‌రికి చ‌ప్పున గుర్తుకు వ‌చ్చారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో దేశ ప్ర‌జ‌లంతా క‌రెన్సీ కొర‌త‌తో ఆగ‌మాగం అవుతున్న వేళ‌.. పీల‌గా ఉండే బ‌క్క‌ప‌ల్చ‌టి మ‌నిషి చాలా సీరియ‌స్ గా తాను చెప్పాల్సిన విష‌యాన్ని సూటిగా చెప్పేసి త‌న దారిన తాను పోయేవారు. పెద్ద నోట్ల ర‌ద్దు ఎపిసోడ్‌ లో త‌ర‌చూ ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చి.. ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు ప్ర‌క‌టించేవారు. క‌రెన్సీ నోట్ల కొర‌త‌పై ఆయ‌న ధీమాను ప్ర‌ద‌ర్శించే వారు. అలా సుప‌రిచిత‌మైన ఆయ‌న‌.. ఇప్పుడు ఏకంగా ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ గా అపాయింట్ అయ్యారు.

ఊహించ‌ని రీతిలో ఊర్జిత్ ఎగ్జిట్ అయిన నేప‌థ్యంలో.. ఆయ‌న స్థానంలో ఎవ‌రినైనా తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్ ను ప్ర‌క‌టిస్తార‌ని ఆశించారు. అందుకు భిన్నంగా రోజంటే.. రోజు వ్య‌వ‌ధిలోనే మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఉర్జిత్ స్థానంలో శ‌క్తికాంత దాస్ ను ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ గా ఎంపిక చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఉర్జిత్ సేవ‌ల్ని పొగిడిన ప్ర‌ధాని మోడీ తాను చేయాల్సిన ప‌ని తాను చేస్తే.. ఆయ‌న రాజీనామా మీద మ‌రెలాంటి ఆలోచ‌న లేకుండా ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ ఓకే చేసేశారు. ఆ విష‌యాన్ని ప్రెస్ కాన్ఫ‌రెన్స్ పెడితే లేని పోని ఇబ్బందుల‌న్న విష‌యాన్ని గుర్తించిన‌ట్లున్నారు.. ట్వీట్ ద్వారా ప్రపంచానికి తాను ఇవ్వాల్సిన ఆప్డేట్‌ను ఇచ్చేసి ఊరుకున్నారు.

ఇంత‌కీ ఈ శ‌క్తికాంత దాస్ ఎవ‌రు?  ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆయ‌న్ను మోడీ స‌ర్కారు ఎంపిక చేయ‌టం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే ఆస‌క్తిక‌ర స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమంటే..

+ శక్తికాంత్‌ దాస్‌ 1980 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. దిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో హిస్టరీలో డిగ్రీ పట్టా అందుకున్నారు.

+ చ‌రిత్ర‌లో డిగ్రీ చేసిన ఆయ‌న‌.. తన 37 ఏళ్ల సుదీర్ఘ స‌ర్వీసులో ఆర్థిక శాఖ విభాగాల్లోనే ఎక్కువ కాలం పనిచేయడం విశేషం.

+ 2014లో భాజపా నేతృత్వంలో ఎన్‌ డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రెవెన్యూ విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు.

+ అనంత‌రం ఆర్‌ బీఐ సంబంధిత విషయాలు, పరపతి విధాన వ్యవహారాలు చూసుకూనే ఆర్థిక వ్యవహారాల విభాగానికి కార్యదర్శి అయ్యారు.

+ 2017 మేలో పదవీ విరమణ చేశారు. అనంత‌రం 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా దాస్‌ను ప్రభుత్వం నియమించింది. జీ-20 దేశాల సదస్సులో భారత్‌ తరపు ప్రతినిధిగా కూడా ఆయనను ఎంపిక చేసింది.

+ ప్ర‌భుత్వం చేసిన తాజా ప్ర‌క‌ట‌న‌తో ఆయ‌న ఆర్‌బీఐ 25వ గవర్నరుగా బాధ్యతల్ని అప్ప‌గించిన‌ట్లైంది.  నార్త్‌ బ్లాక్‌ నుంచి మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు మింట్‌ స్ట్రీట్‌కు చేరుకుంది.

+  శక్తికాంత దాస్‌ కు ముగ్గురు ఆర్థిక మంత్రులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ప్రణబ్‌ ముఖర్జీ - చిదంబరం - అరుణ్‌ జైట్లీల హయాంలో ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు.

+ ప్రణబ్‌ - చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ల్లోనూ సంయుక్త కార్యదర్శిగా - అదనపు కార్యదర్శిగా ఆయన తన వంతు  పాత్ర పోషించారు.

+ కీలక సమస్యల్ని ప‌రిష్క‌రించే వేళ‌లో అంద‌రినీ ఏక‌తాటిపైకి తెచ్చి ఇష్యూను క్లోజ్ చేసే సామ‌ర్థ్యం ఆయ‌న‌కు ఉంద‌న్న పేరుంది.

+ మోడీ స‌ర్కారు ప్ర‌క‌టించిన పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో.. ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌లు.. పెద్ద నోట్ల కొర‌తపైనా త‌ర‌చూ మీడియా స‌మావేశాల్ని నిర్వ‌హించి.. అన‌వ‌స‌ర‌మైన ఆందోళ‌న‌ల‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు.

+ మోడీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన జీఎస్టీలోనూ ఆయ‌న పాత్ర ఎక్కువ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News