మంట పుట్టిస్తున్న కమలనాథుడి లెటర్ బాంబ్

Update: 2015-07-21 06:21 GMT
విపక్షాలన్న తర్వాత విమర్శలు చేయటం.. తీవ్రమైన ఆరోపణలు చేయటం మామూలే. కానీ..స్వపక్షానికి చెందిన ఒక సీనియర్ నేత విరుచుకుపడితే పరిస్థితేంటి? ఇప్పుడు ఇదే చర్చ బీజేపీలో మొదలైంది. గురి చూసి కొట్టినట్లుగా.. సరిగ్గా పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కావటానికి ముందు ఈ లెటర్ బాంబ్ బీజేపీలో కలకలం రేపుతోంది.

పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాసిన సీనియర్ బీజేపీ నేత.. గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై కడిగి పారేశారు. పార్టీలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలు తల కొట్టేసేలా ఉన్నాయని వాపోయిన సదరు నేత.. ఆ లేఖను అమిత్ షాకు పంపటమే కాదు.. తన ఫేస్ బుక్ అకౌంట్లో తాను సంధించిన లేఖాస్త్రాన్ని పెట్టేశారు.

తాజా లెటర్ బాంబుతో కలకలం రేపుతున్న  నేత హిమాచల్  ప్రదేశ్ కు చెందిన శాంతకుమార్. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే.. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. పార్టీలో అంతర్గత లోక్ పాల్ వ్యవస్థ ఏర్పాటు కావాలన్న ఆయన.. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన లలిత్ మోడీ వివాదం.. సుష్మ.. వసుంధరాజె.. మహారాష్ట్ర.. రాజస్థాన్ లలో చోటు చేసుకున్న పలు అంశాల్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు.

వాస్తవానికి శాంతకుమార్ ఈ లేఖను ఈ నెల 10న అమిత్ కు పంపారు. కానీ.. ఆయన సోమవారం తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేయటతో ఆయనగారి మండిపాటు బయట ప్రపంచానికి తెలిసింది.
Tags:    

Similar News