మోడీతో ఢీ : ప్రతిపక్ష శిబిరం నుంచి శరద్ పవార్...?

Update: 2022-06-13 16:10 GMT
ఆయన ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన మరాఠా యోధుడు. ఎన్నో రాజకీయ యుద్ధాలలో ఆరితేరిన మేటి ఘనాపాటి. అత్యంత పిన్న వయసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన శరద్ పవార్ ఆ తరువాత అనేకసార్లు సీఎం అయ్యారు. కేంద్రంలో కూడా వివిధ కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా సేవలు అందించారు. ఆయన జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రను పోషిస్తున్నారు.

ఇక ఎనభయ్యేళ్ల వయసు దాటినా చురుకుగా ఉండే శరద్ పవార్ ఏనాడో ప్రధాని కావాల్సి ఉంది. కానీ ఆయనకు  లక్ కలసి రాక అలాగే ఉండిపోయారు. ఇపుడు దేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి కోసం ఆయన విపక్షాల తరఫున అభ్యర్ధిగా పోటీ పడతారు అని తెలుస్తోంది. విపక్షాలకు ఆయన కంటే సమర్ధుడైన అభ్యర్ధి ఎవరూ లేరు అనే చెప్పాలి. మోడీతో ఢీ కొట్టే సమర్ధత ఆయన సొంతం అని కూడా చెప్పాలి.

వ్యూహాలను రూపొందించడంతో చతురుడిగా పేరు గడించిన శరద్ పవార్ అయితే ఈ కీలక సమయంలో రాష్ట్రపతిగా తప్పక‌ నెగ్గి తీరుతారు అని అంతా భావిస్తున్నారు. అటు ఎన్డీయేకు ఇటు విపక్షాలకు మధ్య  ఓట్ల తేడా ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజీలో అతి స్వల్పంగా ఉంది. అది కూడా వైసీపీ లాంటి పార్టీలు మద్దతు ఇస్తేనే ఎన్డీయేకు లభించేది.

దాంతో నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న ఈ పోటీలో మరాఠాయోధుడు కనుక దిగితే రాష్ట్రపతి ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం తప్పకుండా ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ రేట్ గా పవార్ అభ్యర్ధిత్వానికి  మద్దతు ప్రకటించేసింది. ఆ పార్టీకి  లోక్ సభలో నాయకుడు అయిన మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ తరఫున విపక్షాలతో శరద్ పవార్ అభ్యర్ధిత్వానికి మద్దతు కూడగడుతున్నారు.

ఆయన ఇప్పటికే శరద్ పవార్ ని కలుసుకుని ఆయనతో చర్చలు జరిపారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఉండాలని కూడా కోరారని సమాచారం. అలాగే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ తో కూడా ఖర్గే చర్చలు జరిపారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో ఫోన్ లో మాట్లాడిన ఖర్గే ఆప్ నేత సంజయ్ సింగ్ తో కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇలా అందరి మద్దతు కూడగట్టి శరద్ పవార్ ని రంగంలోకి తెచ్చి గెలిపించుకోవాలని కాంగ్రెస్ గేమ్  ప్లాన్ గా ఉంది.

ఇక ఈ నెల 15న ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో మమతా బెనర్జీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి 22 మంది జాతీయ పార్టీల నాయకులతో పాటు, ఎనిమిది మంది ముఖ్యమంత్రులను ఆమె ఆహ్వానించారు. మొత్తానికి ఎన్డీయే అభ్యర్ధి ఎవరన్నది ఇప్పటికీ తెలియకపోయినా విపక్ష శిబిరం మాత్రం యమ జోరుగా ఉంది. ఒక్క  మాట అయితే ఇక్కడ చెప్పాలి. శరద్ పవార్ గట్టి పిండం. ఆయనను కనుక విపక్ష శిబిరం బరిలోకి దించితే ఎన్డీయే కు చుక్కలు కనిపించడం ఖాయం. ఎందుకంటే ఆయన కుడి ఎడమలను సైతం కలిపేయగల సమర్ధుడు కాబట్టి.
Tags:    

Similar News