ఆ ఆత్మహత్య పై మూడు నెలలుగా రాద్దాంతం అవసరమా ?

Update: 2020-09-22 15:00 GMT
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబైలోని తన ఫ్లాట్ లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డ విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ముంబాయి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు, ఆయన అభిమానులు ఆరోపించారు. ముంబాయి పోలీసుల నుంచి కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుశాంత్ సింగ్ కేసు సీబీఐకి అప్పగించడం అనేక మందికి మింగుడుపడటం లేదు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ సుశాంత్ సింగ్ కేసులో దేశం ఎందుకింత అత్యుత్సాహం చూపుతోందని ప్రశ్నించారు. దేశంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఏ ఆత్మహత్య అయినా విచారకరమేనని ఆయన అన్నారు. కానీ ఈ ఒక్క కేసులోనే యావత్ దేశం అత్యుత్సహం చూపిస్తోందని , ఒక ఆత్మహత్య పై మూడు నెలలుగా ఇంత రాద్దాంతం చేయడం అవసరమా అని అన్నారు. సుశాంత్ కేసు నేపథ్యంలో శివసేన ఆధ్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య రాజకీయ రగడ రేగగా, పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారాన్ని ఆయన కుటుంబ తగాదాగా అభివర్ణిస్తున్నారు. తన మేనల్లుడు అజిత్ పవార్ కుమారుడు ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరగాలన్న బీజేపీ డిమాండును సమర్థించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.
Tags:    

Similar News