షర్మిల సంచలనం..అరవింద్ పై సంచలన ఆరోపణలు

Update: 2021-03-26 16:15 GMT
తాను పెట్టే పార్టీకి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రతి రోజూ మిస్ కాకుండా ఏర్పాటు చేస్తున్న వైఎస్ షర్మిల.. అవసరానికి తగ్గట్లుగా వ్యాఖ్యలు.. విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీదా విమర్శించటానికి వెనుకాడని ఆమె.. తాజాగా తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ కమ్ అదిలాబాద్ ఎంపీ అర్వింద్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీదా విమర్శలు సంధించారు. అన్నట్లు షర్మిలకు అర్వింద్ .. బండి సంజయ్ లు ఎందుకు గుర్తుకు వచ్చినట్లు? అంటారా? దానికో కారణం ఉంది.

ఈ రోజున నిజామాబాద్.. అదిలాబాద్ జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో తనకు ప్రత్యర్థులుగా నిలిచే నేతలపై ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అర్వింద్ పేరును ప్రస్తావించకుండా.. పరోక్షంగా విమర్శలు చేశారు. ‘నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని ఎవరో బాండ్ పేపర్ ఇచ్చారట. బాండ్ పేపర్ ఇచ్చి రైతులను దగా చేశారు’ అంటూ విమర్శించారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలీదా? అని ప్రశ్నించిన ఆమె.. పసుపు రైతుల కష్టాలు వర్ణనాతీతమని.. ఎక్స్ టెన్షన్ సెంటర్ ఇస్తే పసుపు రైతుల కష్టాలు తీరుతాయా? అని నిలదీశారు. భైంసాలో మతకల్లోల్ని సృష్టించ‌డంపై ఉన్న ఆసక్తి రైతుల కష్టాలపై ఉండటం లేదా? అని తప్పు పట్టారు. బండి.. అర్వింద్ లపై విమర్శలు సంధించిన ఆమె.. టీజేఎస్ అధినేత.. ప్రొఫెసర్ కోదండరామ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ప్రొఫెసర్ కోదండం రాం పుట్టిన గడ్డ అదిలాబాద్ అంటూ.. తనకు స్థానిక అంశాల మీద అవగాహన ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. మరి.. షర్మిల వ్యాఖ్యలపై ఇద్దరు బీజేపీ ఎంపీలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.


Tags:    

Similar News