తెలంగాణ భాష డిక్షనరీని చదువుతున్న షర్మిల.. వర్కవుట్ అవుతుందా?

Update: 2021-03-02 14:30 GMT
ఎంత తెలంగాణ కోడలైనా సరే ఆమె ఆంధ్రా బిడ్డనే. ఆమె పుట్టింది పులివెందులలో.. కన్నది దివంగత వైఎస్ఆర్.. ఆమె భాష, యాస మొత్తం రాయలసీమ.. మరి తెలంగాణ రాజకీయాల్లో ఎలా రాణిస్తుంది.? ఇప్పటికే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ‘షర్మిల’పై ఆంధ్రానేత అన్న ముద్ర వేశారు. దీంతో ఇప్పుడు ఈ ముద్రను చెరిపేసుకోవడానికి షర్మిల కష్టపడుతున్నారట.. ఇందు కోసం ‘తెలంగాణ భాష’పై కోచింగ్ తీసుకుంటూ యాసను అవపోసన పట్టేందుకు కష్టపడుతున్నట్టు భోగట్టా..

తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని పట్టుదలతో ఉన్న వైఎస్ షర్మిల.., ఇక్కడి రాజకీయాల్లో ఉద్దండ పిండాలైన కేసీఆర్, కేటీఆర్ సహా రేవంత్ రెడ్డి లాంటి నేతలను ఢీకొట్టే స్థాయిలో తెలంగాణ యాసను నేర్చుకుంటున్నారట.. తెలంగాణ రాజకీయాల్లో రాణించాలంటే ఏయే అంశాలపై దృష్టి పెట్టాలనే దానిపై తన దగ్గరకు వచ్చి కలుస్తున్న వారి దగ్గర నుంచి షర్మిల సలహాలు, సూచనలు తీసుకుంటోంది.

తెలంగాణ ప్రజల సమస్యలపై దృష్టి పెడుతున్న షర్మిల ఇక్కడి రాజకీయాల్లో రాణించాలంటే ఖచ్చితంగా భాష, యాసపై పట్టు పెంచుకోవాలని.. లేకపోతే మిగతా నేతలు, అందులోనూ టీఆర్ఎస్ నేతలతో పోటీపడడం కష్టమవుతుందని భావిస్తున్నారట. కొందరి సలహా మేరకు తెలంగాణ యాస భాష నేర్చుకొని అలానే మాట్లాడి ప్రజలను మెప్పించేందుకు షర్మిల కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే తెలంగాణ నేతలతో సమావేశాల్లో తెలంగాణ యాసను కొద్దికొద్దిగా ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
Tags:    

Similar News