బీసీసీఐ బాస్ డిసైడ్ అయ్యారు

Update: 2015-09-29 15:35 GMT
భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నూతన అధ్యక్షుడి ఎన్నిక‌పై నెల‌కొన్న ఉత్కంఠ‌త‌కు తెర‌ప‌డింది.  జగన్మోహన్‌ దాల్మియా మృతితో ఏర్పడిన ఖాళీని భ‌ర్తీ చేసేందుకు పూర్తిస్థాయిలో నిర్ణ‌యం జ‌రిగిపోయింది. ఇక అధికార ప్ర‌క్రియ‌ను ముగించి ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయిగా ఉంది. కొత్త అధ్య‌క్షుడిగా శశాంక్‌ మనోహర్‌ ఎన్నిక కానున్నారు. అధ్యక్షుడి ఎంపిక‌ను ప్ర‌క‌టించేందుకు అక్టోబర్‌ 4న బీసీసీఐ బోర్డు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

దాల్మియా స్థానంలో మనోహర్‌ బాధ్యతలు అందుకోనున్నారు. ఆయన పేరును ఈస్టుజోన్‌ ప్రతిపాదించనుంది. 2017 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్న మనోహర్‌ నాగపూర్‌ కు చెందినవారు. 2008 నుంచి 2011 వరకు బోర్డు అధ్యక్షుడిగా పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన మనోహర్‌ విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా అధ్యక్ష పదవికి నామినేషన్ లు అక్టోబర్‌ 3 లోపు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పదవికి దాదాపు పోటీ ఉండే అవకాశాలే లేవు. ఇప్పటికే బోర్డులోని గ్రూపులన్నీ (శరద్‌ పవార్‌ - జైట్లీ  అనురాగ్‌ ఠాకూర్‌) మనోహర్‌ కు అనుకూలంగా ఉన్నాయి. వారి మద్దతుతోనే ఆయన మరోసారి బోర్డు అధ్యక్ష పదవి అందుకోనున్నారు. ఈ విషయాన్ని అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటించారు. చెన్నై బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్‌ కు ఈ విషయంలో అసంతృప్తి ఉన్నప్పటికీ, శ్రీనివాసన్‌ కు మద్దతు ఎవరు ఇవ్వడంలేదు. కేంద్ర మాజీ మంత్రి పవార్‌ ను ఇటీవల శ్రీ‌నివాస‌న్‌ కలిసినప్ప‌టికీ అంతగా ఫలితం కనిపించలేదు. పవార్‌ - ఠాకూర్‌ లకు మొత్తం 29 ఓట్లలో 20 వరకు ఉన్నాయి. కాబట్టి మనోహర్‌ అక్టోబర్‌ 4న బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది.
Tags:    

Similar News