మోడీకి అనుకూలంగా ఓటేసిన 'ఎన్టీఆర్‌'

Update: 2018-07-21 07:48 GMT
అందుకే అంటారు రాజ‌కీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శ‌త్రువులు ఎవ‌రూ ఉండ‌ర‌ని. ఎప్పుడు ఏమైనా జ‌రిగే అవ‌కాశం రాజ‌కీయంలో మాత్ర‌మే ఉంటుంది. కోప‌తాపాలు.. అభిప్రాయ భేదాలు.. వ్య‌తిరేక‌త అన్నీ కూడా టైమ్లీగా మారిపోవ‌టం మామూలే. అదెంత‌లా అన్న‌ది తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది.

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడిగా.. షాట్ గ‌న్ గా పేరున్న శ‌త్రుఘ్న సిన్హా బిహార్ బీజేపీ నేత‌గా సుప‌రిచితుడు. దాని కంటే కూడా మోడీ తీరును.. ఆయ‌న నిర్ణ‌యాల్ని ఓపెన్ గా విమ‌ర్శించే అతి కొద్దిమంది బీజేపీ నేత‌ల్లో ఆయ‌న ఒక‌రిగా చెబుతుంటారు.

ఆ మ‌ధ్య వ‌ర్మ తీసిన ర‌క్త‌చ‌రిత్ర మూవీలో ఎన్టీఆర్ పాత్ర‌ను ధ‌రించిన శ‌త్రుఘ్న సిన్హా.. టాపిక్ ఈజ్ ఓవ‌ర్ అంటూ అన్న గారిని అచ్చుగుద్దిన‌ట్లుగా దించార‌న్న పేరును సొంతం చేసుకున్నారు. పోలిక‌లు క‌ల‌వ‌కున్నా.. ఎన్టీవోడి డాబు.. ద‌ర్పాన్ని ఏ మాత్రం త‌క్కువ‌గా జీవించిన ఆయ‌న‌.. తాజాగా మోడీ స‌ర్కారుపై టీడీపీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఆస‌క్తిక‌రంగా వ్య‌వ‌హ‌రించారు.

త‌ర‌చూ మోడీ విధానాల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించే ఆయ‌న‌.. తాజాగా ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జ‌రిగిన ఓటింగ్‌లో మోడీకి అనుకూలంగా ఓటు వేసి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. విడి స‌మ‌యాల్లో మోడీ పాల‌సీల్ని త‌ప్పు ప‌ట్టే ఆయ‌న‌.. కీల‌క‌మైన స‌మ‌యంలో మాత్రం ఆయ‌న‌కు అనుకూలంగా వేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

పార్టీ పాల‌సీ వేరు.. విధాన నిర్ణ‌యాల మీద అభిప్రాయాల్ని వెల్ల‌డించ‌టం వేరుగా అభివ‌ర్ణించిన ఆయ‌న మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. రీల్ ఎన్టీవోడిగా తెలుగుప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడైన ఆయ‌న‌.. హోదాకు వ్య‌తిరేకంగా..సొంత‌ పార్టీ తీరును స‌మ‌ర్థించేలా ఓటేశారు. 
Tags:    

Similar News