ఆమెలో రాజకీయ వైరాగ్యం : జగన్ డెసిషన్ తో షాక్...?

Update: 2022-05-18 11:25 GMT
జగన్ తనకు తప్పకుండా న్యాయం చేస్తారని ఆమె ఆశించారు. మూడేళ్లుగా ఆమె పార్టీలో నమ్మకంగా పనిచేస్తున్నారు. అయితే తాజాగా ప్రకటించిన రాజ్యసభ సభ్యుల జాబితాలో ఆమె పేరు లేదు. దాంతో ఆమె ఏకంగా తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. ఆమె శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి వైసీపీ కీలక నేత  కిల్లి కృపారాణి. ఆమె వైఎస్సార్ సలహాతో ఆయన చేయూతతో 2004లో రాజకీయాల్లోకి వచ్చారు.

ఇక 2014లో జగన్ ఆమెను తన పార్టీలోకి రమ్మని ఆహ్వానం పలికినా నాడు రాలేదు. 2019లో మాత్రం తానంటత ఆమె వచ్చి చేరారు. అయితే మూడేళ్లుగా ఆమెకు ఎలాంటి పదవీ అయితే దక్కలేదు. ఈ మధ్య కాలమంతా ఆమె వైసీపీ శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నారు. కానీ అది కాస్తా ఇపుడు మాజీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ కి వెళ్లిపోయింది.

ఈ నేపధ్యంలో ఆమెకు రాజ్యసభ సీటు తప్పకుండా వస్తుంది అని అంతా భావించారు. జగన్ సైతం తన వద్దకు వచ్చిన కృపారాణి దంపతులకు ఈ మేరకు హామీ ఇచ్చారని ప్రచారం సాగింది. చివరికి చూస్తే మాత్రం ఆమె పేరు జాబితాలో లేదు.

బీసీలు అంటూ తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్యకు ఎంపీ పదవి ఇచ్చారు. మరో సీటుని టీడీపీ నుంచి వచ్చిన బీద మస్తాన్ రావుకు ఇచ్చారు. వీరి కంటే కూడా కృపారాణికి ఇస్తే గుర్తింపు రాణింపు ఉండేవి అన్న అభిప్రాయం ఉంది. ఆమె  వైసీపీ ప్రత్యర్ధి పార్టీ టీడీపీ నుంచి వచ్చిన వారు కారు. కాంగ్రెస్ లో ఉన్నా కూడా అది వైఎస్సార్ ఇచ్చిన గుర్తింపు అని చెప్పుకుంటారు.

ఒక విధంగా వైఎస్సార్ ఫ్యామిలీకి విధేయురాలిగా ఉంటారు. ఆమె యూపీయే సర్కార్ లో ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. డాక్టర్ గా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన ఆమెను ఎంపిక చేస్తే బాగుండేది అన్న భావన అందరిలో ఉంది.

అయితే జగన్ ఆలోచనలు మరోలా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెను వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ సీటు నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ రోజుకీ శ్రీకాకుళం జిల్లా ఎంపీకి సరైన అభ్యర్ధి ఎవరూ లేరు. దాంతో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడుని ఓడించేందుకు వైసీపీ గట్టిగానే చూస్తోంది. దాంతో కిల్లి కృపారాణీని ఎంపీగానే పోటీ చేయించాలని భావించే రాజ్యసభ ఆలోచనలు విరమించుకున్నారు అని అంటున్నారు.

అయితే ఈ ప్రతిపాదన గతంలోనే ఆమె సున్నితంగా వద్దు అని అనుకున్నారని, తనకు ఇస్తే టెక్కలి ఎమ్మెల్యే, లేకపోతే రాజ్యసభ సీటు అని కూడా కోరుకున్నారని ఆమె అనుచరులు అంటున్నారు. మొత్తానికి చూస్తే కిల్లి కృపారాణి ఆశలు అన్నీ నీరు కారడంతో  ఆమె రాజకీయ వైరాగ్యంలో పడిపోయారు అని కూడా అంటున్నారు. మొత్తానికి ఆమె తరువాత అడుగులు ఏ విధంగా ఉంటాయన్నది కూడా చర్చ సాగుతోంది.
Tags:    

Similar News