మంచుకొండ‌ను ర‌గిలిస్తున్న 'రేప్‌'

Update: 2017-07-21 04:45 GMT
మ‌రో మంచుకొండ ర‌గిలిపోతోంది. నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కార‌ణం ఏదైనా కానీ ఈ మ‌ధ్య‌న మంచు కొండ‌లు రగిలిపోతున్నాయి. ఓ ప‌క్క ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తీరుతో డార్జిలింగ్ ఎంత‌గా ర‌గిలిపోతుందో తెలిసిందే. విద్యా బోధ‌న‌లో బెంగాలీని త‌ప్ప‌నిస‌రి చేస్తూ మ‌మ‌త తీసుకున్న నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు డార్జిలింగ్ లోని గూర్ఖాలు. త‌మ అస్తిత్వాన్ని దెబ్బ తీసేలా మ‌మ‌త స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మొద‌లెట్టిన ఆందోళ‌న‌లు 40 రోజులు దాట‌ట‌మే కాదు.. డార్జిలింగ్ మొత్తం ర‌గిలిపోయేలా చేయ‌ట‌మే కాదు.. అక్క‌డి జ‌న‌జీవ‌నం పూర్తిగా స్తంభించిపోయింది.

వ‌రుస నిర‌స‌న‌లు.. ఆందోన‌ల‌తో ర‌గిలిపోతోంది. గూర్ఖాల్యాండ్ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల‌న్న ఆందోళ‌న‌లు అంత‌కంత‌కూ పెరిగి.. భారీ హింస‌కు తెర తీస్తోంది. ఇదిలా ఉంటే.. మ‌రో మంచుకొండ అయిన సిమ్లా మ‌రో త‌ర‌హా ఆందోళ‌న‌ల‌తో ర‌గిలిపోతోంది.

ఈ మ‌ధ్య‌న ఒక బాలిక‌ను అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేయ‌టంపై అక్క‌డి వారు ఆగ్ర‌హంతో రగిలిపోతున్నారు. ఉన్న‌త కుటుంబాల‌కు చెందిన నిందితుల్ని కాపాడేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌పై వారు మండిప‌డుతున్నారు. ఈ నెల నాలుగున ఆరుగురు వ్య‌క్తులు ఒక బాలిక‌ను గ్యాంగ్ రేప్ చేసి హ‌త్య చేశారు. కొత్కాయ్ టౌన్‌కు చెందిన స‌ద‌రు బాలిక ఉదంతం అక్క‌డి వారిలో తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేసింది.

ఈ కేసు విచార‌ణ‌లో పోలీసుల నిర్ల‌క్ష్యం అక్క‌డి వారి గుండెలు మండేలా చేస్తున్నాయి. ఉన్న‌త కుటుంబాల‌కు చెందిన యువ‌కులు నిందితులుగా ఉండ‌టంతో.. వారిని త‌ప్పించేందుకు వీలుగా పోలీసులు ఈ కేసు ద‌ర్యాఫ్తును ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ఇదిలా ఉండ‌గా ఈ కేసులో భాగంగా పోలీసుల క‌స్ట‌డీలో ఉన్న ప్ర‌ధాన నిందితుడు రాజేంద‌ర్ సింగ్ మ‌రో నిందితుడు సూర‌త్ తో గొడ‌వ‌ప‌డి హ‌త్య చేశాడు. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది.

నిందితుల్ని కాపాడేందుకే పోలీసులు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న సందేహం అక్క‌డి స్థానికుల్లో తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యేలా చేసింది. దాదాపు రెండు వేల‌కు పైగా ఆందోళ‌న‌కారులు నిర‌స‌న ర్యాలీకు దిగ‌ట‌మే కాదు.. వాహ‌నాల‌కు నిప్పింటించారు. నిందితుల్ని ఉంచిన పోలీస్ స్టేష‌న్ పై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు పోలీసులు గాయ‌ప‌డ్డారు. తాజా అల్ల‌ర్ల నేప‌థ్యంలో షాపులు.. స్కూళ్లు.. ఆఫీసుల్ని మూసివేశారు. జ‌న‌జీవితం స్తంభించింది. ఇదిలా ఉండ‌గా తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ కేసును సీబీఐ విచారించాల్సిందిగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టు కోరింది. జ‌రిగిన ఘ‌ట‌న‌పై నివేదిక అందించాల‌ని  రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ‌ర‌త్.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని కోరారు.
Tags:    

Similar News