లాక్ డౌన్ ఎఫెక్ట్ : భారీగా నష్టపోయిన షిరిడి సాయినాధ ట్రస్ట్ !

Update: 2020-05-07 01:30 GMT
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశంలో లాక్ డౌన్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 24 నుండి లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు. ఇంకా కరోనా కట్టడిలోకి రాకపోవడంతో తాజాగా మరోసారి మే 17 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా దేశంలోని ప్రముఖ ఆలయాలు అన్ని కూడా మూతబడ్డాయి.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా షిరిడిలోని సాయిబాబా ఆలయానికి రోజుకు రూ. 1.5 కోట్లకు పైగా నష్టం వఛ్చినట్టు బాబా మందిర్ ట్రస్ట్ తెలిపింది. మార్చి 17 న ఈ ఆలయం మూసివేసి తిరిగి మే 3 న తెరిచారు. ఈ మధ్య కాలంలో ట్రస్టుకు ఆన్ లైన్ ద్వారా రూ. 2.53 కోట్లు మాత్రమే అందినట్టు తెలిసింది. అలాగే రోజుకు కొన్ని వేల రూపాయల విరాళం అందుతూ వచ్చిందని, ఇది మొత్తం సుమారు ఆరు లక్షల మేరకేనని ట్రస్ట్ వెల్లడించింది.

ఇకపోతే, సాధారణంగా సాయినాథుని ఆలయానికి ఏడాదికి రూ. 600 కోట్ల వరకు విరాళాలు నగదు రూపంలో గానీ, వివిధ కానుకల రూపంలో గానీ అందుతుంటాయి. ఇది రోజుకు 1.64 కోట్లకు పైగానే ఉంటుంది. ఒకవేళ లాక్ డౌన్ జూన్ వరకు పొడిగించిన పక్షంలో.. 150 కోట్లకు పైగా నష్టం వస్తుందని ట్రస్ట్ అంచనా వేసింది. దీనివల్ల తాము చేపట్టే వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
Tags:    

Similar News