బీజేపీకి ముందుంది మొస‌ళ్ల పండ‌గ‌..శివ‌సేన!

Update: 2018-02-02 13:16 GMT
మ‌రో ఏడు నెల‌ల్లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీకి కాంగ్రెస్ షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ‌స్థాన్ లో జ‌రిగిన ఉప ఎన్నికల్లో భాగంగా 2 లోక్‌ సభ స్థానాలు - ఒక అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసి మోదీ స‌ర్కార్ కు షాకిచ్చింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న సాధార‌ణ ఎన్నిక‌ల‌క ముందు సెమీ ఫైన‌ల్ గా భావించిన ఈ ఎన్నిక‌ల్లో ప‌రాజయం బీజేపీకి మింగుడుప‌డ‌డం లేదు. ఈ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌పై బీజేపీ అధిష్టానం విశ్లేషించుకుంటోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీపై శివ‌సేన పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అపుడే ఏమైంద‌ని....ముందుంది మొస‌ళ్ల పండ‌గ అని సెటైర్లు వేసింది.

కొద్ది రోజుల క్రితం బీజేపీతో దోస్తీకి శివ‌సేన రాంరాం చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీంతో, సంద‌ర్భానుసారంగా బీజేపీపై ఆ పార్టీ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తోంది. రాజ‌స్థాన్ ఉప‌ ఎన్నిక‌ల్లో ఓట‌మి బాధ‌తో ఉన్న బీజేపీకి త‌న `మాజీ` మిత్ర ప‌క్ష‌మైన శివ‌సేన చేస్తున్న వ్యాఖ్య‌లు....పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లున్నాయి. గుజరాత్ ఎన్నికలు బీజేపీకి ఒక ట్రైలర్ వంటివ‌న‌ని - రాజస్థాన్ లో వచ్చిన ఫలితాలు ఇంటర్వెల్ మాత్రమేనని... 2019 ఎన్నిక‌ల్లో అసలు సినిమా క‌నిపిస్తుంద‌ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సెటైర్లు వేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అసలు సత్తా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో చేతులు కలపబోమని - త‌మ‌ది ఒంటరిపోరాట‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఎక్కుపెట్టిన‌ బాణం వెనక్కి రాన‌ట్లుగానే....త‌మ పార్టీ నిర్ణ‌యం కూడా మార‌ద‌ని చెప్పారు. పేపర్ల మీద చూడటానికి బ‌డ్జెట్ బాగానే ఉందని....అయితే, క్షేత్ర స్థాయిలో ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చి అమలైతేనే విజయవంతమైన‌ట్ల‌ని అన్నారు. రౌత్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ స్పందించాల్సి ఉంది.

Tags:    

Similar News