మౌనం నుంచి వార్నింగ్ వరకూ వ్యవహారం వెళ్లిందిగా?

Update: 2019-11-01 12:03 GMT
చిరకాల స్నేహం అంటే మాటలా? బలాలే కాదు బలహీనతలు కూడా బాగానే తెలుస్తాయి. బీజేపీ తీరు ఎలా ఉంటుంది? ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవుతుంది? మోడీషాల మైండ్ సెట్ ఏమిటి? వారి ప్లానింగ్ ఎలా ఉంటుంది? ఏం జరగనుంది? ఏం చేస్తే మరేం జరుగుతుందన్న విషయం మీద శివసేనకు మంచి క్లారిటీనే ఉందని చెప్పాలి.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆచితూచి మాట్లాడుతున్న శివసేన స్వరం నెమ్మదిగా మారుతోంది. మొన్నటివరకూ మౌనం ఎక్కువగా.. మాటలు తక్కువగా ఉన్న వారు.. ఇప్పుడు సమయం చూసుకొని మరీ.. గురి చూసిన లాగి పెట్టి కొట్టిన తరహాలో చేస్తున్న వ్యాఖ్యలు కమలనాథుల్లో కొత్త కంగారును తీసుకొస్తున్నాయని చెప్పాలి.   

శివసేనకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని ఇప్పటికే చెప్పిన ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.. ఇప్పుడు బీజేపీ తీరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తన తలబిరుసుతనాన్ని తగ్గించుకోవాలిన వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సంఖ్యా బలాన్ని కూడా సమకూర్చుకోగలమన్న ఆయన మాటలు చూస్తుంటే.. అయితే బీజేపీతో లేదంటే ప్లాన్ బి కూడా రెడీ చేస్తున్నారన్న భావన కలుగక మానదు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తమ రెండు పార్టీల ఉమ్మడి భాగస్వామ్యానికని.. అలాంటప్పుడు చర్చలు జరిపేందుకు బీజేపీ నేతలు ఎందుకు ముందుకు రావటం లేదని కమలనాథుల కోర్టులో బంతి విసిరారు. నిన్నటికి నిన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మర్యాదపూర్వకంగా కలిసి వచ్చిన సంజయ్.. తాను దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లానని చెబుతున్నారు. కానీ.. తరచి చూస్తే.. రోజులు గడుస్తున్న కొద్దీ శివసేన నేతల మాటల్లో పదును అంతకంతకూ పెరుగుతుందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News