మోడీ మిత్రుడికి మ‌ళ్లీ కోపం వ‌చ్చింది!

Update: 2016-09-19 16:15 GMT
మిత్ర‌ప‌క్షం అంటే అధికార పార్టీ అడుగుల‌కు మ‌డుగులొత్తాలి. వారేం చేసినా తందాన తాన అని త‌లాడించాలి. ఇన్నాళ్లూ మ‌నం చూస్తున్న మిత్ర‌ప‌క్షాల వైఖ‌రి ఇదే. అయితే, శివ‌సేన మాత్రం అందుకు భిన్నం. కాస్త తేడా వ‌చ్చినా చాలు ప్ర‌ధామంత్రి మోడీపై విమ‌ర్శ‌లు చేసేందుకు ఏమాత్రం వెన‌క‌డాని భాజ‌పాకి ప్రియ‌మైన మిత్రుడు శివ‌సేన‌! సంద‌ర్భం వ‌స్తే చాలు మోడీ పాల‌పై పార్టీ అధికార ప‌త్రిక సామ్నాలో ఏకి పారేస్తుంటుంది. ఆ మ‌ధ్య ప్ర‌ధానిగా మోడీ పాల‌న రెండేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంలో మిత్ర‌ప‌క్షాల‌న్నీ మిఠాయిలు పంచుకుంటే శివ‌సేన మాత్రం సామ్నాలో మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇప్పుడు మ‌రోసారి మోడీ తీరును ఎండ‌గ‌ట్టే అవ‌కాశం వ‌చ్చింది... వెన‌క్కి త‌గ్గ‌కుండా మ‌రోసారి సామ్నా పత్రిక ద్వారా విరుచుకుప‌డింది.

ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప‌రిపాల‌న తీరు కాంగ్రెస్ పార్టీ కంటే అధ్వాన్నంగా ఉంద‌ని శివ‌సేన మండిప‌డింది. అందుకే ఉగ్ర‌వాదులు ఇలా రెచ్చిపోతున్నారంటూ విమ‌ర్శించింది. క‌శ్మీరులో ఈ మ‌ధ్య త‌ర‌చూ పాకిస్థాన్ జెండా ఎగురుతోంద‌నీ, భార‌త్ వ్య‌తిరేక నినాదాల‌తో మార్మోగుతోంద‌ని ఆరోపించింది. ప‌ఠాన్ కోట్ ఘ‌ట‌న త‌రువాత పాక్ మీద స‌రైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈరోజున యురీ ఘ‌ట‌నకు కార‌ణంగా సామ్నా ప‌త్రిక పేర్కొంది. పాకిస్థాన్ చ‌ర్య‌ల‌ను అంత‌ర్జాతీయ వేదిక‌పై ఎండ‌గ‌ట్టంలో మోడీ విఫ‌ల‌మ‌య్యార‌ని సేన అభిప్రాయ‌ప‌డింది.

ఆ మ‌ధ్య విదేశీ ప‌ర్య‌ట‌న‌ల పేరుతో అనూహ్యంగా పాకిస్థాన్ వెళ్లొచ్చారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా ఆయ‌న పాక్ కి వెళ్ల‌డంపై అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ ప‌ర్య‌ట‌న‌ను ఇప్పుడు గుర్తుచేసి దెప్పి పొడిచింది శివ‌సేన‌. పాకిస్థాన్ తో ఇలాంటి చుట్ట‌రికం పెట్టుకుంటూ ఇంకోప‌క్క పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదం వ‌ల్ల భార‌త‌దేశంలో ఇబ్బందులు వ‌స్తున్నాయి అని ఇప్పుడు మోడీ స‌ర్కారు మొత్తుకున్నా కూడా అంత‌ర్జాతీయంగా మ‌న‌కి ఎలాంటి మ‌ద్ద‌తు రాద‌నేది శివ‌సేన అభిప్రాయంగా క‌నిపిస్తోంది. భార‌త సైన్యాన్ని పాక్‌పై ప్ర‌యోగించాల‌ని సేన గ‌ట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇంత‌కీ... మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన ఆరోప‌ణ‌ల్ని మోడీ స‌ర్కారు చెవికి ఎక్కించుకుంటుందా..?
Tags:    

Similar News