స్వీట్లు ఆర్డర్ ఇచ్చేశామని చెప్పిన శివసేన

Update: 2019-11-21 07:25 GMT
అధికారాన్ని పంచుకునే విషయంలో తలెత్తిన పంచాయితీ మహారాష్ట్ర రాజకీయాన్ని పూర్తిగా మార్చేయటమేకాదు.. కొత్త పొత్తులకు తెర తీసిందని చెప్పాలి. సుదీర్ఘకాలం బీజేపీతో సాగిన బంధానికి చెల్లుచీటి ఇచ్చేసి.. తనకే మాత్రం పొసగని ఎన్సీపీ.. కాంగ్రెస్ లతో జత కట్టేందుకు శివసేన సిద్ధం కావటం.. అందుకు తగ్గట్లు పరిణామాలు చోటుచేసుకోవటం తెలిసిందే.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావటమే కాదు.. తొలి రెండున్నరేళ్ల పాటు శివసేన పవర్లో ఉండేలా తాజాగా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అన్ని బాగుంటే త్వరలోనే మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా చెబుతున్నారు.

మహారాష్ట్ర తాజా పరిణామాలపై రియాక్ట్ అయిన ఎంపీ సంజయ్ రౌత్.. ఆసక్తికరవ్యాఖ్య చేశారు. శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీలతో కలిసి తాము త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని రౌత్ పేర్కొన్నారు. ఈ శుభవార్తను పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే రివీల్ చేయనున్నట్లు చెప్పారు.

తాము స్వీట్లకు సైతం ఆర్డర్ ఇచ్చేశామని చెప్పటం ద్వారా ప్రభుత్వ ఏర్పాటు ఎంత పక్కానో తేల్చేవారని చెప్పాలి. మొత్తానికి తమ చిరకాల వాంఛ అయిన ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన రంగం సిద్ధం చేస్తుందనుకోవాలి. మరి.. కమలనాథులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News