బీజేపీ సీఎం దీక్ష చేయ‌క‌పోయినా ర‌చ్చే!

Update: 2017-06-12 05:31 GMT
అన్న‌దాత‌ల‌ ఆందోళనలతో అట్టుడుకుతున్న మధ్యప్రదేశ్‌లో శాంతి నెలకొనేవరకూ దీక్ష కొనసాగిస్తానన్న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అనూహ్యంగా దీక్ష విరమించారు. నిరవధిక దీక్షపై సీఎం వెనక్కి తగ్గారు. రాజధాని నగరం భోపాల్‌ లోని దసరా మైదాన్‌ లో దీక్ష చేపట్టి 24 గంటలు గడవకముందే ఆయన దీక్ష విరమించారు. రైతు సంఘాల నేతలు, క్యాబినెట్‌ సహచరులు కలిసి సీఎంకు నిమ్మరసం అందించి దీక్ష ముగిసిందనిపించడం గమనార్హం. నిరాహారదీక్ష చేయవద్దని రైతులు కోరినందునే తాను దీక్ష విరమిస్తున్నానని ఆయన ప్రకటించడం కొసమెరుపు!

రుణ మాఫీ - పంటలకు గిట్టుబాటు ధర కోరుతూ మందసోర్‌ లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసు కాల్పులు కలకలం రేపిన విషయం విదితమే. పోలీసు కాల్పుల్లో ఏడుగురు రైతులు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీస్‌ కాల్పులకు నిరసనగా మధ్యప్రదేశ్‌ అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన తరుణంలో సీఎం దీక్షకు దిగడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. చౌహాన్‌ సింగ్‌ దీక్షను విరమించడం పట్ల కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన ప్రతినిధి కె.కె. మిశ్రా మాట్లాడుతూ ``చౌహాన్‌ చేపట్టిన దీక్ష ఒక డ్రామానా? లేక ఒక సంఘటనా లేక తాను చేసిన తప్పులకు పశ్చాత్తాప పడే చర్యా? అనేది ప్రజలకు వివరించాలి`` అని డిమాండ్‌ చేశారు.

మ‌రోవైపు మధ్యప్రదేశ్‌ రైతుల ఆందోళన దేశంలోని ఇతర ప్రాంతాలపైన ప్రభావం చూపుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 60 రైతు సంఘాలు ఒకే వేదిక కిందకు వచ్చి 'కిసాన్‌ మహా సంఘ్‌'గా ఏర్పడ్డాయి. దేశ వ్యాప్త ఆందోళన చేపట్టడానికి సంబంధించిన కార్యాచరణపై కిసాన్‌ మహా సంఘ్‌ చర్చిస్తోంది. మధ్యప్రదేశ్‌ తరువాత పంజాబ్‌ రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కోనుందని వార్త‌లు వెలువడుతున్నాయి. ఇక్కడ పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంజాబ్‌లో ఏడాదికి సగటున 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అధిక పత్తి ఉత్పత్తి, అకాల వర్షాలు పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ - ఉత్తర ప్రదేశ్‌ ల మధ్య విస్తరించిన బుందేల్‌ ఖండ్‌ ప్రాంతం కొన్ని సంవత్సరాలుగా కరువు ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రాంతంలో తాగు నీటి సంక్షోభం ఏర్పడింది. పశు పక్ష్యాదులు చనిపోతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ కూడా రైతుల ఉద్య‌మాలు రాజుకునే చాన్సుంద‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News