సీఎం కేసీఆర్‌పై బీజేపీ సీఎం ఫైర్‌.. `కేసీఆర్ పిరికి సీఎం` కామెంట్లు

Update: 2022-01-07 18:30 GMT
ఆయ‌న ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి. కాక‌పోతే.. బీజేపీ నేత‌. ఆయ‌న నేరుగా తెలంగాణ‌కు వ‌చ్చారు. ఇక్క‌డి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడ చూడలేదని అన్నారు. ఆయ‌నే బీజేపీ పాలిత‌ మధ్యప్రదేశ్  రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఇటీవ‌ల తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ జాగ‌ర‌ణ దీక్ష చేయ‌డం.. వెంట‌నే పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. జైలుకు త‌ర‌లించ‌డం.. బెయిల్ రావ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో బండిని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన‌.. శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.

నీకూ కంసుడి గ‌తే?

విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు, కార్యక్రమాలకు బదులిచ్చే సంప్రదాయం ఉందని.. కానీ తెలంగాణ‌లో ఆ పరిస్థితి కన్పించడం లేదని చౌహాన్ అన్నారు.  బండి సంజయ్‌ పోరాటస్ఫూర్తిని ప్రదర్శించారని శివరాజ్‌ సింగ్  అభినందించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా జైల్లో వేస్తే ఆ జైల్లోనే పుట్టిన శ్రీకృష్ణుడు రాక్షసుడైన కంసుడిని వధించాడని శివరాజ్ సింగ్ తెలిపారు. హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే... టీఆర్ ఎస్ కారు పంక్చరైందని ఎద్దేవా చేశారు.

కుటుంబ పాల‌న‌.. ఖ‌బ‌ద్డార్‌

తెలంగాణ గడ్డపైకి వచ్చింది.. బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికేనని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్ను రద్దు చేసింది... బెదిరింపులకు భయపడే పార్టీ బీజేపీ కాదన్న ఆయ‌న‌.. కేసీఆర్కు కలలో కూడా ‘బండి సంజయ్' గుర్తుకొస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. తండ్రి సీఎం, కొడుకు మంత్రి, ఇంకో బంధువు ఎంపీ.. కూతురు ఎమ్మెల్సీ.. ఆమెను కూడా మంత్రిని చేస్తారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీ అంటే బిర్యానీనా?

``కేసీఆర్ నేను కూడా సీఎంనే. నువ్వు రెండోసారి సీఎం కావొచ్చు... నేను నాలుగోసారి సీఎంగా కొనసాగుతున్నా.. మీలాగా సంస్కార హీనంగా వ్యవహారించడం లేదు. బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నావా కేసీఆర్. మేడం సోనియాగాంధీ కూడా ఎందుకింత గాభరా పడుతోంది. పంజాబ్ ప్రభుత్వం ప్రధానమంత్రిని దేశ సరిహద్దులో 20 నిమిషాలు రోడ్డుపై ఆపేస్తే మద్దతిస్తారా? ఇదేనా రాజనీతి?. కేసీఆర్.. డబుల్ బెడ్రూం ఇండ్ల సంగతేమైంది?. నిరుద్యోగ భృతి ఏమైంది?. కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది?. వీటికి జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? అని శివ‌రాజ్ నిప్పులు చెరిగారు.
Tags:    

Similar News