స‌చివాల‌యానికి రాని సీఎంను నేనెక్క‌డా చూడ‌లేదు

Update: 2019-06-26 11:53 GMT
తెలంగాణ‌పై బీజేపీ గురి పెట్టింద‌న్న ప్ర‌చారానికి త‌గ్గ‌ట్లు.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు టీఆర్ ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు చిరాకు పుట్టించేవిగా చెప్పాలి. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏకంగా నాలుగు సీట్ల‌లో బీజేపీ ఎంపీలు గెలిచిన తీరుతో బీజేపీ అధినాయ‌క‌త్వం క‌న్ను తెలంగాణ మీద ప‌డింది.

తామెంత క‌ష్ట‌ప‌డినా తెలుగు రాష్ట్రాల్లో ఎద‌గ‌లేమ‌న్న భావ‌న‌కు వ‌చ్చిన వేళ‌.. అనుకోని అదృష్టం త‌లుపు త‌ట్టిన‌ట్లుగా నాలుగు ఎంపీ స్థానాల్లో త‌మ పార్టీ నేత‌లు గెల‌వ‌టంతో .. తెలంగాణ‌లో త‌మ‌కున్న ప‌ట్టును మ‌రింత‌గా బిగించాల‌న్న నిర్ణ‌యానికి మోడీషాలు వ‌చ్చిన‌ట్లు చెబుతారు.

మొద‌ట్నించి  కేసీఆర్ తో దోస్తానాకు ట్రై చేసిన మోడీషాలు.. ఎప్ప‌డే విధంగా మాట్లాడ‌తారో అర్థం కాని  కేసీఆర్ ను న‌మ్ముకోవ‌టం క‌న్నా.. రాష్ట్రంలో త‌మ సొంత బ‌లాన్ని పెంచుకోవ‌టం మేల‌న్న భావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు చెబుతారు. తాజాగా తెలంగాణ‌కు వ‌చ్చిన బీజేపీ సీనియ‌ర్ నేత‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాను ప‌దిహేనేళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశాన‌ని.. స‌చివాల‌యం ముఖం చూడ‌ని ముఖ్య‌మంత్రిని తానెప్పుడూ చూడ‌లేద‌ని చుర‌క‌లు వేశారు. కేసీఆర్ కుటుంబ‌ పాల‌న‌లో తెలంగాణ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నార‌ని చెప్పిన ఆయ‌న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో త‌మ‌కు 20 శాతం ఓట్లు ఇచ్చిన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తొలిసారి తెలంగాణ‌కు వ‌చ్చిన శివ‌రాజ్ సింగ్ చౌహాన్.. రాష్ట్ర కార్యాల‌యంలో విలేక‌రుల‌తో మాట్లాడారు. బీజేపీ స‌భ్య‌త్వ జాతీయ ప్ర‌ముఖ్ హోదాలో వ‌చ్చిన ఆయ‌న కేసీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకొని ప‌దునైన విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల్ని చూస్తే..
 
+  తెలంగాణ‌లో బీజేపీ వేగంగా పుంజుకుంటోంది. బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కశ్మీర్ రాష్ట్రాల్లలో అధికారమే లక్ష్యంగా పనిచేయబోతున్నాం.  

+  తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. నేను 15 ఏళ్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశా. ఏ ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని చూడలేదు.

+  నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లుంటే తెలంగాణ సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేది. ఒక్క కేంద్ర పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటం లేదు.  రాష్ట్రంలో బీజేపీని వేగంగా బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం.

+ జులై 6న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. కళాకారులు, క్రీడాకారులను సైతం బీజేపీ కుటుంబంలో భాగస్వాములను చేస్తాం. అన్ని వ‌ర్గాల్ని స‌భ్య‌త్వంతో భాగ‌స్వామ్యుల‌ను చేస్తాం. కేసీఆర్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తాం.

    
    
    

Tags:    

Similar News