కరోనా సీఎం బిరుదుకు ఆయనకే..

Update: 2020-03-24 04:30 GMT
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పుట్టిన ఎందరికో స్వరాజ్యం అనే పేరు పెట్టుకున్నారు.. అలాగే స్కైలాబ్ కూలిపోయినప్పుడు పుట్టిన వారిలో చాలా మందికి స్కైలాబ్ అనే పేరు ఉంది. ఇప్పుడు ప్రపంచంతో పాటు దేశంలోనూ కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. దేశం మొత్తం కరోనాకారణంగా లాక్ డౌన్‌లో ఉన్న సమయంలో మధ్యప్రదేశ్‌ సీఎం మారారు. గతంలో ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పుడు మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన్ను అంతా కరోనా సీఎం అంటున్నారు.

మధ్యప్రదేశ్ సీఎంగా బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం శివరాజ్ సింగ్ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్లో గవర్నరు లాల్జీ ఠాండన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. చౌహాన్ ఇంతకుముందు 2005, 2008, 20013లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమి పాలవడం తో చౌహాన్ పదవి కోల్పోయారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

కానీ, కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మలుపు తీసుకున్నాయి. సీఎం పదవి ఆశించి భంగపడిన జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం.. ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరడంతో కమలనాథ్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో శివరాజ్ సింగ్ మరోసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు.

దేశమంతా రాజకీయాలకు అతీతంగా కరోనా భయంతో వణుకుతున్న వేళ, కరోనాతో పోరాడుతున్న వేళ శివరాజ్ సింగ్ సీఎంగా ప్రమాణం చేయడంతో సోషల్ మీడియాలో కొందరు ఆయన్ను కరోనా సీఎం అంటూ సరదాగా సెటైర్లు వేస్తున్నారు.


Tags:    

Similar News