షాకే.. ఈ భాష‌లోనూ క్రికెట్ కామెంట‌రీ.. వీడియో వైర‌ల్!

Update: 2022-10-04 08:55 GMT
మ‌న‌దేశంలో క్రికెట్ కు ఉండే క్రేజు వేరు.. మ్యాచులు చూడ‌టంలో ఉండే మ‌జా వేరు. భార‌త్‌లో క్రికెట్‌ను కూడా ఒక మతంలా భావిస్తారంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా క్రికెట్‌ను ఆద‌రిస్తార‌నే విష‌యం తెలిసిందే. కాగా మొద‌ట్లో క్రికెట్ కామెంట‌రీ ఇంగ్లిష్‌లో మాత్ర‌మే ఉండేది. ఆ త‌ర్వాత కొంత కాలానికి హిందీలోనూ కామెంట‌రీని ప్ర‌వేశపెట్టారు. ఇక అప్ప‌టి నుంచి మ‌న‌దేశంలో మ్యాచులు జ‌రిగితే ఇంగ్లిష్‌, హిందీల్లో క్రికెట్ కామెంట‌రీ వినిపించేది.

ఆ త‌ర్వాత సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్), ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ప్ర‌వేశంతో ప్రాంతీయ భాష‌ల్లోనూ క్రికెట్ కామెంట‌రీ ప్ర‌వేశించింది. ఇంగ్లిష్‌, హిందీల‌తోపాటు మ‌న తెలుగులోనూ క్రికెట్ కామెంట‌రీ మొద‌లైంది. క్రికెట్ కామెంట‌రీని తెలుగులో విన‌డం భ‌లే గ‌మ్మ‌త్తుగా అనిపించేది.

ఇలా ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు కామెంట‌రీ తెలిసిన మ‌న‌కు ఇప్పుడు దేవ భాష‌గా పేరొందిన సంస్కృతంలోనూ క్రికెట్ కామెంట‌రీ వినే అవ‌కాశం ద‌క్కింది. సంస్కృతంలో క్రికెట్ కామెంట‌రీని వినిపిస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

వేద మంత్రాల్లా ఉన్న ఈ సంస్కృత క్రికెట్ కామెంట‌రీ ఇప్పుడు నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. 45 సెకండ్లు మాత్ర‌మే ఉన్న ఈ వీడియోను ఇప్ప‌టికే 3.29 లక్ష‌ల మంది చూశారు.

కొందరు యువ‌కులు కలిసి క్రికెట్‌ ఆడుతున్న వీడియోలో ఓ వ్యక్తి గుక్క తిప్పుకోకుండా మంత్రాలు చ‌దివిన‌ట్టు సంస్కృతంలో కామెంటరీని వినిపిస్తున్నాడు. ఎవ‌రి మాతృభాష‌ల్లో వాళ్లు మాట్లాడ‌ట‌మో నామోషీగా భావిస్తున్న ఈ రోజుల్లో సంస్కృతంలో సదరు వ్యక్తి కామెంట‌రీ వినిపించ‌డం నిజంగా విశేష‌మేనంటున్నారు.. నెటిజ‌న్లు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇలాంటి కామెంటరీ వినడం ఇదే మొదటిసారి అంటూ నెటిజన్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 'అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సంస్కృతంలో కామెంటరీ చెప్పించాలి' అంటూ నెటిజ‌న్లు కోరుతుండటం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News