రండి.. సారొచ్చారు.. మీరు ఇప్పుడు గుర్తొచ్చారు! సోయంపై కామెంట్లు అదురుతున్నాయే!!

Update: 2022-12-20 11:30 GMT
ఆయ‌న ఎంపీ. పైగా ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆదీవాసీ నాయ‌కుడు. ప్ర‌స్తుతం బీజేపీ నేత‌గా దూకుడుగా ఉన్నారు. త‌న‌కు తిరుగేలేద‌ని ప‌దే ప‌దే అనేక స‌భ‌ల్లోనూ చెబుతుంటారు. అయితే, ఇది నిన్న‌టి మాట‌. కానీ, ఇప్పుడు ఆయ‌న చేయించుకున్న సొంత స‌ర్వేలో.. ఫ‌లితం క‌ళ్ల‌ముందు క‌నిపించేస‌రికి త‌ట్టుకోలేక పోతున్నారు. దీంతో ఇంకేముంది.. ఇప్ప‌టి వ‌ర‌కు తాను దూరం పెట్టిన త‌న వారిని.. అంటే త‌న సామాజిక వ‌ర్గం ఆదివాసీల‌ను చేర‌దీస్తున్నారు. రండి.. రండి.. రండి.. అంటూ.. వారి స‌మ‌స్య‌లు వినేందుకుసిద్ధ‌మ‌వుతున్నారు.

ఆయ‌నే.. ఆదిలాబాద్ పార్ల‌మెంటుస‌భ్యులు సోయం బాపూరావు.  గోండు తెగ ఆదివాసీల‌కు చెందిన తుడుం దెబ్బ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రుగా ఆయ‌న ఎదిగారు. ఉద్య‌మాలు చేశారు. గోండుల త‌ర‌ఫున గ‌ళం వినిపించారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న ఏం సాధించారో తెలియ‌దు కానీ.. తాను మాత్రం ఆదివాసీల ఓటు బ్యాంకును సొంతం చేసుకుని..  గ‌తంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల్లో ఏకంగా ఎంపీనే అయ్యారు. అయితే.. గ‌త రెండేళ్లుగా ఆయ‌న గోండుల‌ను మ‌రిచిపోయార‌నే వాద‌న ఉంది.

అంతేకాదు.. కీల‌క‌మైన ఎస్టీ జాబితా నుంచి లంబాడా సామాజిక వ‌ర్గాన్ని తొల‌గించాల‌ని ఉద్య‌మాలు చేసిన ఆయ‌న వాటిని ఉన్న‌ప‌ళంగా వ‌దిలేశారు.(సీఎం కేసీఆర్ వీరిని ఎస్టీల్లోనే కొన‌సాగించాల‌ని అనుకుంటున్నారు.

బ‌హుశ అందుకేనా? అనేది ప్ర‌శ్న‌) దీంతో ఆదివాసీలు ఇప్పుడు ఎంపీ సోయం .. అంటే సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నారు. ఇక‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు సోయంను స‌మ‌ర్ధించిన నాయ‌కులు కూడా ఇప్పుడు ఆదివాసీల ఎఫెక్ట్‌తో ఆయ‌న‌కు దూర‌మ‌య్యారు. దీంతో ఇప్పుడు సోయం.. ఒంట‌రి అయిపోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఎంతైనా రాజ‌కీయ నాయ‌కుడుగా మారిన ఉద్య‌మ నేత క‌దా.. వెంట‌నే ప్లేట్ మార్చేశారు. రండి.. నేనున్నానంటూ.. ఆదివాసీలకు క‌బురు పెడుతున్నారు.  ఆదివాసీల హక్కుల కోసం  మళ్లీ పోరాటం సాగిస్తానని హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మ్మింది చాల‌ని చాలా మంది ఆదివాసీలు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. మొత్తానికి కీల‌క‌మైన ఎన్నిక‌ల ముంగిట‌.. సోయంకు ఆదివాసీలు ఇస్తున్న షాకులు.. ఆయ‌న‌కు మ‌తి పోగొడుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News