బాబుగారి `ఏడు`పు భ‌లే ఉందే.. !

Update: 2021-05-03 10:30 GMT
తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో టీడీపీకి ఎదురైన సంక‌ట స్థితి అంతా ఇంతా కాదు!  బ‌ల‌మైన యోధులుగా పేరున్న చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు  లోకేష్‌, పార్టీ రాష్ట్ర అద్య‌క్షుడు అచ్చెన్నాయుడు వంటి వారు వారాల త‌ర‌బ‌డి అక్క‌డే తిష్ట‌వేసి.. మ‌రీ ప్ర‌చారం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం మాత్రం దారుణం గా మారింది. గ‌త 2019 ఎన్నిక‌ల‌కంటే.. కూడా టీడీపీకి ఓటింగ్ షేర్ త‌గ్గిపోయింది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీకి 37 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు 5 శాతం ఓట్లు త‌గ్గి కేవ‌లం 32 % ఓట్లే వ‌చ్చాయి. ఇక్క‌డ కేంద్ర మాజీ మంత్రిగా ఉండి వ‌రుస‌గా రెండో సారి పోటీ చేసిన ప‌న‌బాక ల‌క్ష్మి వ‌రుస‌గా ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే.. దీనిపై ఆత్మ విశ్లేష‌ణ‌, విచార‌ణ చేసుకోవాల్సిన చంద్ర‌బాబు ఆయ‌న ప‌రివారం.. మ‌రోసారి వైసీపీ కేంద్రంగా రాజ‌కీయాలు ప్రారంభించారు.

``జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పారు. మిడిసిపాటు త‌గ్గించారు. నేల‌కు దింపేశారు.`` ఇలా.. అనేక కామెంట్లు చేశారు.. చంద్ర‌బాబు. అయితే.. దీనికి సంబంధించి ముందు ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన పార్టీ టీడీపీ. ఎందుకింత‌గా పార్టీ ఖ‌ర్మ కాలిపోయింది?  ఎందుకు ఇలా జ‌రిగింది?  తానే స్వ‌యంగా రంగంలోకి దిగి ప్ర‌చారం చేసినా.. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓటు బ్యాంకు ఎందుకు త‌గ్గిపోయింది? అనే విష‌యాన్ని చంద్ర‌బాబు ముఖ్యంగా ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అస‌వ‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇది వ‌దిలేసి.. కింద‌ప‌డ్డా.. పైచేయి మాదే అన్న‌ట్టుగా మాట్లాడుతుండ‌డాన్ని ప‌రిశీల‌కులు, విశ్లేష‌కులు కూడా త‌ప్పుబడుతున్నారు.

ప్ర‌ధానంగా ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోలైన ఓట్ల‌ను ప‌రిశీలిస్తే.. టీడీపీ ప‌రిస్థితి ఏంటో తెలుస్తుంది. కీల‌క మైన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ చ‌తికిల ప‌డిన ప‌రిస్థితి క‌నిపించింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళ హస్తి, సత్యవేడు సెగ్మెంట్లకు సంబంధించి గురుమూర్తికి 1,12,140 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ మూడు సెగ్మెంట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. మూడు సెగ్మెంట్లలోనూ కలిపి 4,63,722 ఓట్లు పోల్‌ కాగా వాటిలో వైసీపీకి 2,60891 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 148751 ఓట్లు పడ్డాయి.

నెల్లూరు జిల్లా పరిధిలోని నాలుగు  అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీకి 57 శాతం ఓట్లు పడ్డాయి. 2019 కన్నా కేవలం 1.5 శాతం ఓట్లే పెరిగాయి. టీడీపీకి 32 శాతం ఓట్లు దక్కాయి. ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకొని లెక్కకడితే వైసీపీకి అత్యధికంగా 57 శాతం ఓట్లు పడ్డాయి.  ఈ నియోజకవర్గాల పరిధిలో 6.36 లక్షల ఓట్లు పోల్‌ కాగా వైసీపీకి 3,65,217 ఓట్లు పడ్డాయి. ఇది జిల్లా పరిధిలో పోలైన మొత్తం ఓట్లలో 57 శాతంగా ఉంది. టీడీపీకి 2,05,765 ఓట్లు (32 శాతం) పోల్‌ అయ్యాయి. అంటే.. దీనిని బ‌ట్టి తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ పుంజుకున్న ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. దీనిపై దృష్టి పెట్టాల్సిన చంద్ర‌బాబు.. మాత్రం వైసీపీపై `ఏడు`పు రాగం అందుకున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు!!
Tags:    

Similar News