పబ్ కేసులో పోలీసులకు షాక్.. ఫారినర్లు వెళ్లిపోయారట

Update: 2022-04-09 05:30 GMT
తీవ్ర సంచలనంగా మారిన రాడిసన్ బ్లూ స్టార్ హోటల్ పరిధిలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దొరకటం తెలిసిందే. దాదాపు ఐదు గ్రాముల వరకు మాదక ద్రవ్యాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోవటం.. ఈ సందర్భంగా పబ్ లో ఉన్న 148 మందిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. స్టేషన్ కు తీసుకొచ్చిన వారిలో దాదాపు ఐదారుగురు వరకు విదేశీయులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన వారితో పాటు.. విదేశీయుల వివరాల్ని సేకరించిన పోలీసులు వదిలేశారు.

కేసు విచారణలో భాగంగా విదేశీయులకు సంబంధించిన ఒక అంశం పోలీసులకు షాకింగ్ గా మారిందంటున్నారు. ఏపీలోని అనంతపురంలో జరిగిన ఒక ఫెస్టుకు హాజరైన విదేశీయులు హైదరాబాద్ కు రావటం.. పబ్ కు వెళ్లటం.. అక్కడ ఆకస్మిక తనిఖీల్ని నిర్వహించిన టాస్కు ఫోర్సు టీంకు డ్రగ్స్ లభించటం తెలిసిందే.

ఈ సందర్భంగా పబ్ లో ఉన్నందరిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఎపిసోడ్ లో పోలీసుల తీరును విదేశీయులు తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేయటంతో పాటు.. తనిఖీలు చేసిన సమయంలో తప్పు చేసిన వారు శిక్షకు గురి కావాలే తప్పించి.. ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నారో పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు.

పోలీసులు వ్యవహరించిన తీరు వేధింపులకు గురి చేయటమేనన్న వ్యాఖ్య వారు చేస్తూ.. ఒక దశలో తమ కాన్సులేట్ కు కంప్లైంట్ చేస్తామన్న మాట వినిపించింది. పబ్ నిర్వాహకులు మినహా మిగిలిన వారందరిని విడిచిపెట్టిన పోలీసులు.. తాజాగా వారిని విచారణ కోసం పిలుద్దామని భావిస్తున్నారు. ఈ క్రమంలో విదేశీయులు ఐదారుగురు హైదరాబాద్ నుంచి వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో.. ఇప్పుడు వారి వివరాలు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

వారి దగ్గర సేకరించిన ఫోన్ నెంబర్లుపని చేయటం లేదన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. సంచలన కేసుకు సంబంధించిన వారు గాయబ్ అయిపోవటం కచ్ఛితంగా హైదరాబాద్ పోలీసులు వైఫల్యమే అవుతుందన్న మాట వినిపిస్తోంది.  మరిప్పుడు పోలీసులు ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News