చాలా కాలానికి ఫైర్ చూపించిన కవిత

Update: 2022-01-10 04:40 GMT
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు? ఈ మధ్యన తెలంగాణ అధికారపక్షం వర్సెస్ బీజేపీ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం తెలిసిందే. ఉద్యోగుల బదిలీ విషయంలో కేసీఆర్ సర్కారు జారీ చేసిన జీవోకు వ్యతిరేక స్టాండ్ తీసుకున్న బీజేపీ.. పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు చేపట్టటం.. దీనిపై టీఆర్ఎస్ సర్కారు సీరియస్ గా ఉండటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయటం తెలిసిందే. అప్పటి నుంచి తన నిరసల్ని మరింత ముమ్మరం చేసిన బీజేపీ..వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలతో పాటు.. ముఖ్యమంత్రుల్ని.. కేంద్ర మంత్రుల్ని ఒక వరుస క్రమంలో తెలంగాణకు పంపుతోంది.

తెలంగాణకు వరుస పెట్టిన వారు ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాటల కత్తుల్ని దూస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. మండిపడుతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు.. ముఖ్యనేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కొక్కరుగా కౌంటర్లు ఇస్తున్నారు టీఆర్ఎస్ ముఖ్యనేతలు. తాజాగా ఆ పని చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇటీవల కాలంలో తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే విషయంలో కవిత కాస్త కామ్ గా ఉన్నట్లుగా చెప్పాలి. ఆ లోటును తీరుస్తూ.. తాజాగా రాష్ట్రానికి వచ్చిన అసోం ముఖ్యమంత్రి.. తెలంగాణ ప్రభుత్వ పని తీరును తప్పు పట్టిన వైనాన్ని విమర్శించారు.

అసోం సీఎంచేసిన వ్యాఖ్యల్ని ఆమె తప్పు పట్టారు. తెలంగాణ గొప్ప కల్చర్ ను తుడిచిపెట్టటానికి బీజేపీ ఇంతలా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావటం లేదంటూ కౌంటర్ మొదలు పెట్టిన ఆమె.. తెలంగాణకు వస్తున్న బీజేపీ ముఖ్యమంత్రులు సరిగా హోంవర్కు చేసి రావాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కారు ఇచ్చిన హామీల్ని ప్రస్తావిస్తూ.. ఘాటు విమర్శలు చేశారు.

2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. ఇప్పటికి ఎనిమిదేళ్లు కావొస్తుందని.. అలాంటప్పుడు చెప్పిన మాట ప్రకారం 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? అని ప్రశ్నించారు. అసోం సీఎం మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్న ఆయన మాటలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ ప్రకారం, భారత్‌లో నిరుద్యోగిత రేటు డిసెంబర్‌లో దాదాపు 8 శాతానికి పెరిగిందని పేర్కొంటూ.. వివిధ దేశాల్లో ఉన్న నిరుద్యోగిత రేటును ప్రస్తావించటం ద్వారా..దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. పేద దేశంగా పేర్కొనే బంగ్లాదేశ్ లో 5.3శాతం మాత్రమే ఉందన్నారు.

మెక్సికో (4.7 శాతం), వియత్నాం (2.3శాతం) లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల కంటే కూడా భారత్‌లో నిరుద్యోగ రేటు అధికంగా ఉండటాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టుకుంటూ , తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం అందుకు వ్యతిరేకంగా మాట్లాడటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెబుతూ.. ‘‘మరోసారి తెలంగాణ కు వచ్చినప్పుడు సరైన హోం వర్క్ చేసుకొని రావాలని కోరుతున్నా’ అంటూ పంచ్ డైలాగు మాదిరి కౌంటర్ ఇచ్చిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. మరి.. కవిత మాటలకు కమలనాథులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.


Tags:    

Similar News