షాకింగ్.. 50 రోజుల తర్వాత క్షీణిస్తున్న యాంటీ బాడీలు

Update: 2020-08-29 03:30 GMT
కరోనా  బారిన పడిన వారికి ఆస్పత్రిలో కనీసం రెండు వారాల పాటు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నారు. వ్యాధి  నుంచి కోలుకున్న వ్యక్తుల్లో మూడు వారాల నుంచి శరీరంలో యాంటీబాడీలు  ఉత్పత్తి అవడం  మొదలవుతుంది. ఈ యాంటీబాడీలు  తయారైతేనే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధిగ్రస్తులు క్రమంగా కోలుకోవడంతో పాటు మరోసారి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు.  కరోనా బారిన పడి యాంటీబాడీలు ఉత్పత్తి అయిన వారి నుంచి ప్లాస్మా సేకరించి ప్లాస్మా థెరఫీ కూడా  వైద్యులు  చేస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల  యాంటీబాడీలపై  జరిగిన ఓ సర్వే ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించింది. కరోనా బారినపడి కోలుకున్న వారిలో 50 రోజుల తర్వాత యాంటీబాడీలు  క్షీణిస్తున్నట్లు తెలిసింది. కొందరిలో అసలు యాంటీబాడీలు కనిపించడం లేదనే విషయం వెల్లడైంది. ఈ విషయం ప్రస్తుతం జనాలను ఆందోళన పరుస్తోంది. జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కరోనా బారిన పడ్డ ఆరోగ్య సిబ్బంది పై ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో శరీరంలో యాంటీబాడీలు ఎక్కువ నెలలు ఉండడంలేదని.. 50 రోజుల తర్వాత క్షీణిస్తున్నాయని వెల్లడించింది. యాంటీబాడీలు క్షీణిస్తే ఒకసారి కరోనా  నుంచి కోలుకున్న వాళ్ళు కూడా తిరిగి  వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. జేజే  సర్వేలో భాగంగా కరోనా బారిన పడ్డ 801 మంది వైద్య సిబ్బందిపై అధ్యయనం జరిపారు. వీరు ఏప్రిల్,  మే నెలల్లో కరోనా బారిన పడగా మొదట్లో వారి శరీరంలో యాంటీబాడీలు ఎక్కువ సంఖ్యలో కనిపించాయి. జూన్ లో మరోసారి పరీక్షించగా వీరిలో యాంటీబాడీలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇది ఆందోళన కలిగించే విషయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా  వ్యాధి తీవ్రత పెరిగి లక్షలాది కేసులు నమోదు అవుతున్నాయని, క్లినికల్ ట్రయల్స్ ముగిసి మందులు, వ్యాక్సిన్లు వస్తే తప్ప కరోనాకు అడ్డుకట్ట వేయలేమని వైద్యులు చెబుతున్నారు.
Tags:    

Similar News