‘క్రాక్’ కు మించిన కౌర్యం.. మామిడికాయ కోశారంటూ ఎంతలా హింసించారంటే..

Update: 2021-04-02 13:30 GMT
లాక్ డౌన్ తర్వాత విడుదలైన క్రాక్ సినిమా గుర్తుందా? రవితేజ సూపర్ కాప్ గా నటించిన ఈ చిత్రంలో ఒక పాప మామిడి కాయ కోసిందన్న కోపంతో.. కుక్కలతో దాడి చేయించి.. దారుణంగా హింసించే సీన్ ఒకటి ఉంటుంది. మామిడికాయ కోసం మరీ అంత దారుణంగా వ్యవహరిస్తారా? అన్న సందేహం కలుగుతుంది. కానీ.. తొర్రూరుతో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించి వింటే షాక్ తినాల్సిందే. పిల్లలు మామిడికాయల్ని దొంగతనం చేసేందుకు వచ్చారన్న అనుమానంతో వారిని హింసించిన వైనం ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది.

మానవత్వానికి మచ్చలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరుకు చెందిన ఇద్దరు మైనర్లు.. తాము పెంచుకుంటున్న కుక్క కనిపించకుండా పోయింది. దాన్ని వెతుక్కుంటూ పట్టణ శివారు మామిడితోటకు వచ్చారు. ఈ క్రమంలో ఆ పిల్లలు మామిడి పిందెల్ని దొంగతనం చేసేందుకు వచ్చినట్లుగా అనుమానించిన కాపలాదారులు దారుణంగా వ్యవహరించారు.

వారిని పట్టుకొని పశువుల్ని కొట్టినట్లుగా కొట్టటమే కాదు.. వారి చేతుల్ని.. కాళ్లను తాళ్లతో కట్టేశారు. తాముతప్పు చేయలేదని ఎంతలా ఏడుస్తున్నా వదలకుండా.. వారి చేత పేడ తినిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాసేపటికే ఇది వైరల్ గా మారింది.నిజంగానే దొంగతనానికి వచ్చినా అంతలా హింసించే హక్కు ఎవరికి ఉండదు. పోలీసులకు అప్పజెప్పాలి. అందుకు భిన్నంగా.. మానవత్వాన్ని మర్చిపోయి వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విషయం తెలిసిన పిల్లల తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. మరికొందరు ప్రజాప్రతినిధులు జిల్లా ఎస్పీ.. కలెక్టర్ వరకు విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దీంతో.. కాపలాదారులైన బానోత్ యాకు.. బానోతు రాములను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అసలు తప్పు జరిగిందా? లేదా? అన్న విషయం తేల్చుకోకుండానే ఆరాచకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News