ఏవండోయ్ ఇది విన్నారా.. వెధవది పురోహితుడే తాళిబొట్టు కొట్టేశాడ‌ట‌!

Update: 2021-05-19 23:30 GMT
ఇదో అరుదైన సంఘ‌ట‌న‌.. బ‌హుశా చాలా మంది మొద‌టిసారి వింటున్న వార్త కూడా కావొచ్చు. సీన్ ఓపెన్ చేస్తే.. ఓ పెళ్లి మండ‌పం. పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు పీట‌ల‌పై ఉన్నారు. బంధుమిత్రులు సంద‌డిగా ఉన్నారు. పెళ్లి జరిపించే అయ్య‌వారు అల‌వాటైన మంత్రాల‌ను అల‌వోక‌గా వ‌ల్లిస్తున్నారు. అమృత‌పు ఘ‌డియ‌లు రానేవ‌చ్చాయి. పెళ్లి మండ‌పంలో బంధువులు.. ఆకాశంలో దేవుళ్లు.. వ‌ధూవ‌రుల‌పై అక్షింత‌లు వేయ‌డానికి రెడీగా ఉన్నారు. మాంగ‌ల్య‌ధార‌ణ జ‌ర‌గాల్సిన వేళ‌.. అస‌లైంది క‌నిపించ‌కుండా పోయింది.

అదేనండీ.. తాళిబొట్టు మాయ‌మైపోయింది. అప్ప‌టి వ‌ర‌కు ప‌చ్చికొబ్బ‌రికాయ‌పై ఉంచిన తాళిబొట్టు.. అప్ప‌టిక‌ప్పుడే క‌నిపించ‌కుండా ఎటుపోయిందో ఎవ్వ‌రికీ అర్థం కాలేదు. ఎక్క‌డైనా జారిప‌డిపోయిందా? అని మండ‌పం మొత్తం వెతికారు. పెళ్లికి వ‌చ్చిన బంధువులంతా హాల్ మొత్తం వెతికారు. కానీ.. దొర‌క‌లేదు. ఎలా దొరుకుతుంది చెప్పండి.. అది సంభావ‌న సంచిలో చేరిపోయిన త‌ర్వాత‌? అర్థం కాలేదా..? ఆ పెళ్లి జ‌రిపించ‌డానికి వ‌చ్చిన పంతులుగారే మంగ‌ళ‌సూత్రాన్ని స్వాహా చేశారుట‌! అవునా.. అని నోరెళ్ల బెడుతున్నారా? ఎంత పెద్ద‌గా నోరు తెరిచినా.. వాస్త‌వం అదేన‌ని సాక్ష్యం ఘోషిస్తోంది మ‌రి!

అది ఎలా బ‌య‌ట‌ప‌డిందో చూద్దాం. పెళ్లి మండ‌పంలో తాళిబొట్టు లేద‌ని పెళ్లి ఆగ‌కూడ‌దు క‌దా.. ముందుగానైతే పెళ్లి జ‌రిపిద్దామ‌ని ప‌సుపు కొమ్ముతో ఆ కార్యాన్ని మ‌మ అనిపించారు. కానీ.. తాళిబొట్టు క‌నిపించ‌కుండా పోయింది.. ఇదెక్క‌డ అరిష్టం అనుకుంటూ ఇరు ప‌క్షాల వాళ్లు లోప‌ల మ‌ద‌న ప‌డుతూనే ఉన్నారు. ఒక‌టా రెండా..? మూడు తులాల బంగారం మరి. దాదాపు 1.50 లక్షల రూపాయలు! దీన్ని త‌లుచుకుంటూ కాలం గ‌డుపుతుండగా.. అయ్య‌గారి య‌వ్వారం బ‌య‌ట‌ప‌డే సంద‌ర్భం వ‌చ్చేసింది.

పెళ్లి వీడియోలో పురోహితుడి చోర‌క‌ళ స్ప‌ష్టంగా న‌మోదైంది. అందులో.. ఎవ్వ‌రూ చూడ‌ట్లేదుక‌దా అని అటూ ఇటూ చూసిన అయ్య‌వారు.. మంగ‌ళ సూత్రాన్ని స్మూత్ గా సంచిలో తోసేశారు. ఎవ్వ‌రూ చూడ‌లేదు అనుకున్నారు.. వెధ‌వ‌ది కెమెరా చూసేసింది! ఇంకేముందీ.. ఖేల్ ఖతం. వెంటనే అయ్యవారి ఇంటికి వెళ్లిన పెళ్లివారు.. పురోహితుడి పిల‌క‌ప‌ట్టుకున్నారు. ముందు బుకాయించిన అత‌గాడు.. ఆ త‌ర్వాత‌ అస‌లు నిజం ఒప్పుకోక త‌ప్ప‌లేదు. ఇంత‌కీ ఏం చేశావంటే.. ఓ బంగారు కొట్లో తాక‌ట్టు పెట్టేశాడ‌ట.

ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం జ‌రిగింది. సో.. చూశారుగా ఇక‌మీద‌ట అయ్య‌గారిని పిలుస్తున్న‌ప్పుడు.. మంత్ర జ్ఞాన‌మే కాదు, హిస్ట‌రీని కూడా తెలుసుకోండి.
Tags:    

Similar News