తిరుపతిలో ఘోరం : వరదలో నీటిలో చిక్కుకున్న కారు.. నవ వధువు మృతి !

Update: 2021-10-23 07:30 GMT
పెళ్లి .. బంధువులు , సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. కొత్త జీవితంలో అడుగుపెట్టే ముందు కుటుంబ సభ్యులతో కలిసి నూతన దంపతులు దైవ దర్శనానికి బయలుదేరారు. కానీ విధి ఆ జంటను చిన్నచూపు చూసింది. సందడిగా సాగుతున్న ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. వరదనీటి రూపంలో మృత్యువు ఆ జంటను విడదీసింది. వారి నూరేళ్ల జీవితాన్ని కాలరాసింది. అందరూ చూస్తుండగానే కొత్త పెళ్లి కూతురి ఊపిరిపోయింది. దీనితో  ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. రాష్ట్రంగాని రాష్ట్రం, ఊరుకాని ఊరిలో వారి రోదనలు మిన్నంటాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో శుక్రవారం రాత్రి ఘోర విషాదం చోటు చేసుకుంది. వర్షపునీరు రెండు కుటుంబాలను విషాదంలో ముంచేసింది. కర్నాటక  లోని రాయచూర్ జిల్లాకు సంధ్య అనే యువతికి ఇటీవలే హరీష్ అనే యువకుడితో పెళ్లైంది. పెళ్లి తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొత్తజంటతో పాటు కుటుంబ సభ్యులు బయలుదేరారు. రాయచూర్ నుంచి తిరుపతికి వచ్చారు. తిరుమల వైపు వెళ్తుండగా వీరి వాహనం తిరుపతిలోని వెస్ట్ చర్చ్ ప్రాంతంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకుంది. బ్రిడ్జి ప్రాంతం పల్లంగా ఉండటంతో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి భారీగా వర్షపు నీరు నిలిచింది.

డ్రైవర్ కు ఆప్రాంతం కొత్తకావడం, అప్పటికే చీకటి పడటంతో నీరు కనిపించక వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దాదాపు ఎనిమిది అడుగుల మేర నీరు నిలవడంతో వారి వాహనం పూర్తిగా మునిగిపోయింది. అందులోని వారు తేరుకొని బయటకు వచ్చేలోగా వధువు సంధ్య ఊపిరాడక మృతి చెందింది. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు మిగిలిన వారిని రక్షించాడు. వధువు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. రైల్వే అండర్ బ్రిడ్జి కారణంగా రోడ్డు బాగా పల్లంగా ఉండటంతో భారీగా నీరు నిలిచిపోయింది.

వర్షం కురిసినప్పుడు ఇక్కడ భారీగా నీరు నిలుస్తుందని స్థానికులకు బాగా తెలుసు. కానీ, బాధితులు స్థానికేతరులు కావడం, ఎక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఘోరం జరిగింది. వర్షపు నీరు నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో తెల్లారేసరికి మున్సిపల్ సిబ్బంది నీటిని తోడేశారు. మరోవైపు కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికేనా అధికారులు స్పందించి వెస్ట్ చర్చి ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News