షాకింగ్: ఈటల రాజేందర్ కు మంత్రి కేటీఆర్ ఫోన్

Update: 2022-08-25 12:36 GMT
టీఆర్ఎస్ కేబినెట్  నుంచి గెంటివేయబడ్డ ఈటల రాజేందర్ బీజేపీలో చేరి టీఆర్ఎస్ ను ఎదురించి మరీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు టీఆర్ఎస్ పైనే పోరుసాగిస్తున్నారు.

ఒకప్పుడు కేసీఆర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు ఈటలకు ఉండేవి. కానీ పొగబెట్టి పంపాక కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేసి ఈటల రాజేందర్ రాజకీయం చేస్తున్నారు. బీజేపీలో ఏకంగా చేరికల కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు.

టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు  మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవాడు ఈటల. కేటీఆర్ అయితే స్వయంగా ఈటలను అన్నా అని పిలిచేవారు. అంతటి క్లోజ్ నెస్ కాస్త చెడింది. అయితే సంబంధాల విషయంలో మాత్రం కేటీఆర్ మానవత్వం ప్రదర్శించారు.

తాజాగా ఈటల రాజేందర్ కు మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేయడం చర్చనీయాంశమైంది. ఇందుకు తగిన కారణం ఉంది. ఈటల రాజేందర్ తండ్రి, శతాధిక వృద్ధుడు ఈటల మల్లయ్య (105) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య హైదరాబాద్ లోని ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు.

ఈటల స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ లో బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. మల్లయ్యకు 8 మంది సంతానం కాగా.. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఈటల రాజేందర్ రెండో కుమారుడు.

ఈటల రాజేందర్ తండ్రి మరణవార్త తెలిశాక చాలామంది వివిధ పార్టీల నేతలు ఆయన్ను కలిసి పరామర్శించారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ సైతం స్వయంగా ఈటలకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈటల మల్లయ్య మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు.
Tags:    

Similar News