రష్యా సైన్యానికి చిక్కి.. చిక్కిశల్యమై.. ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫొటోలు వైరల్

Update: 2022-09-28 05:18 GMT
దురాక్రమణతో రగిలిపోతున్న రష్యా.. తమ చేతికి ఎంతకూ చిక్కకుండా పోరాడుతున్న ఉక్రెయిన్ విషయంలో మరణహోమానికి పాల్పడుతోంది. అక్కడ ఇప్పటికే శవాల దిబ్బలను మిగిల్చిన రష్యా.. తమ చేతికి చిక్కిన ఉక్రెయిన్ సైనికులను చిత్రహింసలకు పాల్పడుతోంది. ఇటీవల విడుదలైన ఓ ఉక్రెయిన్ సైనికుడి చిత్రం చూసి ప్రపంచమే కన్నీళ్లు పెట్టుకుంది. అతడి చేయి విరిచేసి.. ఎముకలు తేలేలా హింసించి.. ఒంటిపై అసలు మాంసం లేకుండా హింసించిన వైనం చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జెనీవా ఒప్పందాలను తుంగలోకి తొక్కి రష్యా చేస్తున్న ఈ దమనకాండను అందరూ ఖండిస్తున్న పరిస్థితి నెలకొంది.

ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా సైన్యం చేతికి చిక్కిన ఉక్రెయిన్ సైనికులు నరకం చూశారని బయటపడింది. రష్యా జైళ్ల నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్  అనే ఉక్రెయిన్ సైనికుడి ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఉక్రెయిన్ మంత్రిత్వశాఖ ఆ షాకింగ్ ఫొటోలతోపాటు రష్యా జెనీవా ఒప్పందాలకు కట్టుబడి దాదాపు 204 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను విడుదల చేసినట్టు పేర్కొంది.  అందులో ఒక సైనికుడిని చిత్ర హింసలకు గురిచేసినట్టు అతడి పాత ఫొటోను.. ఇప్పటి ఫొటోను పంచుకుంది. నాజీయిజానికి చెందిన వారసత్వాన్ని రష్యా ఇలా కొనసాగిస్తోంది అని క్యాప్షన్ జోడించింది.

యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్న సైనికుడి రూపు.. రష్యా చెర నుంచి బయటపడిన తర్వాత అత్యంత ఘోరంగా మారిపోయింది. ఆ సైనికుడు ఇతడేనా? అనేంత విస్తుపోయేలా దారుణంగా హింసించారు. డయానోవ్ రష్యా నుంచి ప్రాణాలతో బయటపడినందుకు అదృష్టవంతుడనే చెప్పాలి.

మారయుపోల్ లోని అజోవ్ స్టల్ స్టీల్ వర్క్ లను రక్షించే నిమిత్తం యుద్ధం చేస్తున్న సమయంలోనే నిర్బంధించబడ్డాడు. రష్యా విడుదల చేసిన 250 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలలో అతడు ఒకడు. అతడు ముఖం, చేతులపై గాయాలతో కృశించిపోయి ఉన్నాడని అతడి సోదరి తెలిపింది. ప్రస్తుతం డయానోవ్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొంది.

పేలుడు పదార్థాలలోని ఒక లోహం అతడి చేతిలోకి దిగిపోయిందని.. అయితే దాన్ని వారు ఎలాంటి మత్తుమందు ఇవ్వకుండా తీయడంతో సుమారు 4 సెం.మీల ఎముకను తీసేయాల్సి వచ్చినట్టు వెల్లడించింది. అతడి పరిస్థితి సీరియస్ గా ఉందని.. దీర్ఘకాలిక చికిత్స అవసరమని కన్నీటి పర్యంతం అయ్యింది. అతడు తిరిగివచ్చినందుకు ఆనంద పడుతున్నట్టు సోదరి తెలిపింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News