షాకింగ్ క్వశ్చన్.. బెంగాల్ కోసం దేశ శ్రేయాన్ని పణంగా పెట్టారా?

Update: 2021-04-21 06:30 GMT
మోడీ కమిట్ మెంట్ ను ఎవరూ శంకించరు. దేశం పట్ల.. దేశ ప్రజల విషయంలోనూ ఆయన తపిస్తారన్న మాటను తప్పు పట్టటం లేదు. ఎంతటి వాడికైనా.. ఏదో ఒక బలహీనత ఉన్నట్లుగా.. మోడీకి బెంగాల్ బలహీనత ఉంది. అదే ఈ రోజున దేశం కరోనా బారిన పడి.. విలవిలలాడేలా చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. సుదీర్ఘంగా సాగే బెంగాల్ ఎన్నికల ప్రక్రియ దేశ క్షేమానికి భంగకరంగా మారిందని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ పీఠాన్ని సొంతం చేసుకోవాలి.. బెంగాల్ మీద బీజేపీ జెండా ఎగరాలన్న పట్టుదల.. మోడీ తన శక్తియుక్తులు మొత్తాన్ని ఆ రాష్ట్రం మీద ఫోకస్ చేశారని చెప్పటానికి వెనుకాడాల్సిన అవసరం లేదు.

కరోనా లాంటి కీలక అంశం.. బెంగాల్ మీద ఆయనకున్న మోజుతో వెనక్కి వెళ్లిపోయింది. అంతేకాదు.. కరోనా వేగాన్ని గుర్తించటంలో మోడీ విఫలమయ్యారని చెప్పాలి. బెంగాల్ లెక్క తేల్చేసి.. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో ఆ ఇష్యూను క్లోజ్ చేసి.. కరోనా సంగతి చూద్దామనుకున్నారేమో? కానీ.. కరోనా స్పీడ్ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో.. యావత్ దేశం మీదా మహమ్మారి పడగనీడ పడిందని చెప్పాలి.

బెంగాల్ లో గెలవటం మీద మోడీకున్న శ్రద్ధ.. కరోనా పోరు విషయంలో ఎందుకు లేదన్న సూటి ప్రశ్న ఈ రోజున విపక్షాల నుంచి వినిపిస్తోంది. కరోనా తొలిదశలో.. విపక్షాలు వేలెత్తి చూపించేందుకు అవకాశం ఇవ్వని మోడీ సర్కారు.. ఈ రోజున అందుకు భిన్నంగా బంతాట ఆడుకోవటం.. వారు సంధించే ప్రశ్నలకు బీజేపీ నేతలు మౌనాన్ని తప్పించి.. మళ్లీ మాట్లడకుండా ఉండేలా రియాక్టు కాలేకపోతున్న వైనాన్ని చూస్తే.. విషయం ఇట్టే అర్థమవుతుంది.

బెంగాల్ లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటానికి మరో వారం రోజులకు పైనే సమయం ఉండటం.. అప్పటివరకు తమ ఫోకస్ ను పెడితే.. దేశంలో కరోనీ తీవ్రత చేయి దాటిపోవటమే కాదు.. మొదటికే ముప్పు వస్తుందన్న విషయాన్ని గుర్తించిన బీజేపీ.. బెంగాల్ లో భారీ ర్యాలీల్ని నిర్వహించకూడదన్న నిర్ణయానికి రావటం తెలిసిందే. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. ఒక్కటి మాత్రం నిజం. బెంగాల్ మోజులో పడిన మోడీ.. దేశాన్ని కరోనాకు వదిలేశారన్న మరకను మాత్రం తుడుపుకోలేరన్న మాట వినిపిస్తోంది. ఇందులో నిజమెంతన్నది కాలం తేల్చనుంది.
Tags:    

Similar News