షాకింగ్ నివేదిక.. కరోనా మరణాల్ని దాచేస్తున్న ప్రపంచ దేశాలు

Update: 2021-05-22 10:30 GMT
కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు చోటు చేసుకుంటున్న మరణాలకు.. ప్రభుత్వం ప్రకటిస్తున్న మరణాలకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదంటూ పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పది మంది మరణించినట్లుగా ప్రభుత్వం అధికారిక లెక్కలు చెబితే.. ఒక ఆసుపత్రిలోనే పది మంది మరణించిన వైనాలెన్నో మీడియాలో వచ్చాయి. మరణాల్ని దాచేసే రోగం మనకు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచంలోని చాలా దేశాలు చేస్తున్న విషయాన్ని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

కరోనా మరణాల గణన నిర్దిష్ఠంగా సాగలం లేదని.. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కనీసం 30 లక్షల మంది కరోనాతో మరణిస్తే.. ఆయా దేశాలు అధికారికంగా ప్రకటించిన మరణాలు కేవలం 18 లక్షలు మాత్రమేనని.. దాదాపు 12 లక్షలకు పైగా మరణాలు లెక్కల్లోకి రాలేదని పేర్కొంది.  2020 డిసెంబరు 31 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 8.2 కోట్లు కాగా.. మరణించిన వారు 18 లక్షలుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

అయితే.. వాస్తవానికి మరణాలు మరింత ఎక్కువగా ఉన్నాయని.. చాలా దేశాల్లో కరోనా బారిన పడి.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన వారిని లెక్కించే విషయంలో తేడా చేసినట్లుగా పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగిన రోగుల మరణాల్ని మాత్రమే లెక్కలోకి తీసుకున్నారని.. వ్యాధి నిర్దారణ కాక ముందు కన్నుమూసిన వారిని లెక్కల్లోకి తీసుకోలేదని సదరు నివేదిక తెలిపింది. మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. కరోనా నిర్దారణ అయి మరణించిన వారికి సంబంధించి లెక్కల విషయంలో దేశంలోని చాలా రాష్ట్రాలు తక్కువగా చేసి చూపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మహానగరాల్ని పక్కన పెడదాం.. పట్టణాలు.. గ్రామాల్లో నమోదవుతున్న మరణాలకు.. రిపోర్టుల్లో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదన్న వాస్తవం ఇన్నాళ్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించటం గమనార్హం.
Tags:    

Similar News