కాబూల్ ఎయిర్ పోర్టులో షాకింగ్ సీన్లు.. ఎంతటి దారుణ పరిస్థితి అంటే?

Update: 2021-08-16 08:58 GMT
అంచనాలకు మించి చాలా త్వరగా తాలిబన్ల చేతికి అధికారం వచ్చేసింది. అప్గానిస్తాన్ కాస్తా తాలిబన్ స్తాన్ గా మారిపోయినట్లే. దేశాధ్యక్షుడు గుట్టుచప్పుడు కాకుండా దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. తాపీగా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి.. మారణహోమం ఇష్టం లేకనే తాలిబన్లతో పోరాడలేదని సెలవిచ్చారు. అధ్యక్షుల వారి ప్రాణాలు ఎంత ముఖ్యమో.. మిగిలిన దేశ ప్రజల ప్రాణాలు అంతే ముఖ్యం కదా? అందుకే.. తాలిబన్ల రాజ్యాన్ని జీర్ణించుకోలేని అఫ్గాన్ పౌరులు కాబూల్ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు.

ఏదోలా కాబూల్ నుంచి బయటపడితే చాలన్నట్లుగా ఉంది వాళ్ల పరిస్థితి. తాజాగా కాబూల్ ఎయిర్ పోర్టు పరిస్థితి చూస్తే.. 75 ఏళ్ల క్రితం భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి.. దేశ విభజన వేళ ఇరు దేశాల పౌరులు రైలులోచోటు దక్కించుకోవటంపడిన తాపత్రయం అప్రయత్నంగా గుర్తుకు రాక మానదు. కాలం మారినా.. కొన్ని దేశాల బతుకులు మారలేదన్న విషయం వైరల్ అవుతున్న ఈ వీడియోల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అగ్రరాజ్యంగా గొప్పలు చెప్పుకునే అమెరికా.. ఒక దేశ భవిష్యత్తును.. కొన్నికోట్ల జీవితాల్ని ఎంత ఈజీగా వదిలేయగలదో అఫ్గాన్ ఉదంతం చెప్పకనే చెబుతుందని చెప్పాలి. ఆ మాటకు వస్తే అమెరికా మాత్రమే కాదు.. అగ్రరాజ్యాలన్ని ఈ రోజున అఫ్గాన్ పరిస్థితికి బాధ్యత వహించాల్సిందే. ప్రపంచానికి దన్నుగా నిలుస్తామని బోడి లెక్చర్లు దంచే వారు.. ఐక్యరాజ్యసమితి.. ప్రపంచ మేధావులు అఫ్గాన్ తో తమకేం సంబంధం లేనట్లుగా వదిలేయటం ఎంతవరకు సబబు?

తన ప్రయోజనాలకు భంగం వాటిల్లినంతనే ఎవరూ అడగకుండానే అఫ్గాన్ మీద యుద్ధం చేసి.. తాలిబన్లను తరిమేసిన అమెరికా.. ఈ రోజున మళ్లీ అదే తాలిబన్లను అధికారాన్ని బంగారుపళ్లెంలో పెట్టి ఎలా ఇవ్వగలుగుతారు? ఈ డిజిటల్ యుగంలోనూ రాక్షస పాలనకు ప్రపంచ దేశాలన్ని ఎలా ఆమోదిస్తాయి? ఇవాళ అఫ్గాన్ లో జరిగింది రేపొద్దున మరో దేశంలో జరిగితే? ఇవాళ అఫ్గాన్ ప్రజల్ని వారి కర్మకు వదిలేస్తే.. రేపొద్దున మరో దేశప్రజల భవితను ఇలానే కర్మకు వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందేమో.

అఫ్గానిస్తాన్ మొత్తంలో ఒక్క కాబూల్ ఎయిర్ పోర్టు తప్పించి మిగిలిన ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోఉంది. దీంతో.. ఎయిర్ పోర్టుకు రావటంతో తమ ప్రాణాల్ని దక్కించుకోవాలన్న అత్రుతతో పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకుప్రజలు పోటెత్తుతున్నారు. వీరిని కంట్రోల్ చేయటం సాధ్యం కాని అమెరికన్ సైనికులు గాల్లో కాల్పులు జరుపుతున్నారు. ఏదోలా విమానంలో ప్రయాణించి విదేశాలకు పారిపోవాలని భావిస్తున్న వారి కారణంగా ఇప్పటివరకు ఏ ఎయిర్ పోర్టులో చూడని సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఒక విమానంలో గుంపులు గుంపులుగా ఎక్కేసి.. నిలుచోవటానికి జాగా దొరికితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్న వారి తీరు చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

https://twitter.com/NicolaCareem/status/1427122975971561475
Tags:    

Similar News