కేసీఆర్ కు షాకిస్తూ.. గవర్నర్ తమిళిసై సంచలనం

Update: 2022-06-09 06:30 GMT
అటు కేంద్రం ఓవైపు కేసీఆర్ ను అన్నిరకాలుగా టైట్ చేస్తోంది. ఇటు మరోవైపు ఇటువైపు నుంచి గవర్నర్ తమిళిసై నరుక్కు వస్తున్నారు. దీంతో కేసీఆర్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కేసీఆర్ ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా తమిళిసై తాజాగా రాజ్ భవన్ వేదికగా ప్రజాదర్భార్ నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడం కోసం గవర్నర్ తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జూన్ 10న శుక్రవారం రాజ్ భవన్ లో ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా మహిళల సమస్యలను తెలుసుకోవడానికి మహిళా దర్భార్ నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. జూన్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగనుంది.

ఇక ప్రజా దర్భార్ కార్యక్రమంలో గవర్నర్ ను వచ్చి కలవాలనుకునే మహిళలు 040-23310521కు కాల్ చేయడం ద్వారా లేదా rajbhavan-hydgov.inకు మెయిల్ చేయడం ద్వారా అపాయింట్ మెంట్ తీసుకోవచ్చని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో ఇటీవల మహిళలపై అత్యాచారాలు, హత్యలు వంటి నేరాల ఘటనలు, ప్రత్యేకించి రాష్ట్రంలోని ఒక ఉన్నత ప్రాంతంలో మైనర్ పై సామూహిక అత్యాచారం ఘటనపై పెనుదుమారం చెలరేగిన నేపథ్యంలో ఈ మహిళా దర్భార్ కేసీఆర్ సర్కార్ ను ఇరుకునపెట్టే విధంగానే తయారైంది.

తెలంగాణలో మహిళలకు భద్రత లేదని గవర్నర్ ఈ మహిళా దర్భార్ ద్వారా ఫోకస్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే డీజీపీ, సీఎస్ లను జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై వివరణ కోరారు. ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న ఇతర ఫిర్యాదులకు సంబంధించి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకోవడానికి మహిళా దర్భార్ ను పెడుతున్నారు. దీంతో ఇది ప్రభుత్వం, గవర్నర్ కు మధ్య మరో పోరాటంగానే అభివర్ణిస్తున్నారు.

గవర్నర్ తమిళిసైకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాధం నెలకొంది. ఇప్పటికే తమిళిసైని టార్గెట్ చేసుకొని తెలంగాణ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకుండా తనను అవమానించిన తీరుపై ఏకరువు పెట్టారు. ఈ వివాదం సద్దుమణగకముందే గవర్నర్ ప్రజాదర్భార్ నిర్వహించడం రాజకీయంగా సంచలనమైంది. కేసీఆర్ సర్కార్ తో గవర్నర్ నేరుగా ఢీకొంటున్నట్టు అవుతోంది.
Tags:    

Similar News