మోడీ అమెరికా టూర్ పై షాకింగ్ వార్నింగ్

Update: 2021-09-17 05:30 GMT
షాకింగ్ వార్నింగ్ చేసింది ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ. ఈ నెల 24న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష కుర్చీలో జో బైడెన్ కూర్చున్న తర్వాత తొలిసారి అమెరికా పర్యటన చేస్తున్న ఆయనకు.. ఊహించని రీతిలో హెచ్చరికలు ఎదురయ్యాయి. అమెరికా పర్యటన సందర్భంగా నిద్ర లేని రాత్రుల్ని గడపాల్సి వస్తుందని సదరు సంస్థ పేర్కొంది. వైట్ హౌస్ వెలుపల కూడా నిరసన కార్యక్రమాల్ని చేపడతామని పేర్కొంది.

భారత్ లో రైతులపై హింసకు వ్యతిరేకంగా తాము నిరసనలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. తొలిసారి ప్రత్యక్ష క్వాడ్ సమావేశంతో పాటు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాల్గొనటానికి వెళుతున్న మోడీకి సదరు ఉగ్రవాద సంస్థ జనరల్ కౌన్సిల్ గర్పత్ వంత్ సింగ్ పన్నన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

యూకే.. యూఎస్.. యూరోపియన్ యూనియన్ దేశాలు తాలిబన్లను గుర్తిస్తే.. తమ సంస్థ కూడా ఖలిస్తాన్ మద్దతు కోసం తాలిబన్లను సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఖలిస్థాన్ పై రెఫరెండమ్ ను లండన్ లో ఆగస్టు 15న నిర్వహిస్తామని ఈ సంస్థ ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత కొవిడ్ కారణంగా దీన్ని అక్టోబరకు వాయిదా వేశారు. ఈ సంస్థపై చర్చించేందుకు నిఘా అధికారులు ఇటీవల ఢిల్లీలో పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించినట్లుగా చెబుతారు.

ఈ ఉగ్రవాద సంస్థ తమ ప్రచారం కోసం వాట్సాప్ గ్రూపుల్ని క్రియేట్ చేయటంతో పాటు.. పంజాబ్ యువతను విద్రోహ కార్యకలాపాలకు ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వాట్సాప్ గ్రూపులో పాక్ కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ల నంబర్లు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంస్థను 2019 జులై 10న బ్యాన్ చేశారు. ఏదోలా ఆరిపోయిన ఖలిస్థాన్ ఉద్యమాన్ని కెలకాలని.. భారత్ ను ఆస్థిరపర్చాలన్న దుర్మార్గమైన ఆలోచన చేస్తోందీ సంస్థ. మరి.. దీన్ని మోడీ సర్కారు ఎలా అడ్డుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి.


Tags:    

Similar News