అస‌ద్ పై బూటు విసిరారు

Update: 2018-01-24 07:30 GMT
మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీకి చేదు అనుభ‌వం ఒక‌టి ఎదురైంది. ఫైర్ బ్రాండ్ పేరున్న ఆయ‌న మాట‌లు ఎంత ప్ర‌భావ‌వంతంగా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా మ‌హారాష్ట్రలోని ఒక స‌భ‌లో మాట్లాడుతున్న వేళ ఆయ‌న ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది.

ద‌క్షిణ ముంబ‌యిలోని నాగ్ ప‌ద‌లో మంగ‌ళ‌వారం రాత్రి ఒక స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో ట్రిపుల్ త‌లాక్ గురించి అస‌దుద్దీన్ మాట్లాడుతున్న వేళ‌.. ఒక బూటు ఆయ‌న వైపు దూసుకొచ్చింది. రాత్రి 9.45 గంట‌ల వేళ‌లో జ‌రిగిన ఈ ఉదంతం కాసేపు గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం చోటు చేసుకునేలా చేసింది.

గుర్తు తెలియ‌ని వ్య‌క్తి విసిరిన బూటు.. అస‌ద్ కు త‌గ‌ల్లేదు. ఈ ఉదంతం చోటు చేసుకున్న త‌ర్వాత కూడా ఎలాంటి త్రోటుపాటుకు గురి కాకుండా అస‌ద్ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ప్ర‌జాస్వామ్యం కోసం త‌న ప్రాణాల్ని సైతం అర్పిస్తాన‌ని అస‌ద్ వ్యాఖ్యానించారు.

ట్రిపుల్ తలాక్ ను సాధార‌ణ ప్ర‌జ‌లు.. ముఖ్యంగా ముస్లింలు అంగీక‌రించ‌టం లేద‌న్న వాస్త‌వాన్ని గుర్తించ‌టం లేద‌న్న అస‌ద్‌.. "వీళ్లంతా అస‌హ‌న‌ప‌రులు. మ‌హాత్మాగాంధీ.. గోవింద్ ప‌న్సారే.. న‌రేంద్ర ద‌భోల్క‌ర్ ల‌ను చంపేసిన హంత‌కుల భావ‌జాలాన్నే నాపై బూటు విసిరే వారు అనుస‌రిస్తున్నారు" అంటూ మండిప‌డ్డారు. విద్వేష భావ‌జాలం కార‌ణంగానే ఇలాంటి దాడులు జ‌రుగుతాయ‌ని వ్యాఖ్యానించారు.

త‌న‌పై బూటు విసిరిన ఉదంతానికే ఇన్నేసి మాట‌లు చెబుతున్న అస‌ద్‌.. మ‌జ్లిస్‌కు కంచుకోట లాంటి హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో వేరే పార్టీ వారు క‌నీస ప్ర‌చారానికి వ‌చ్చినా ఊరుకోక‌పోవ‌టాన్ని ఏమ‌నాలి?  విద్వేష భావ‌జాలం కార‌ణంగానే దాడులు జ‌రుగుతాయ‌ని చెప్పే అస‌ద్‌.. పాత‌బ‌స్తీలో వామ‌ప‌క్ష నేత‌ల్ని త‌మ పార్టీకి చెందిన నేత‌లు పెద్ద ఎత్తున దాడులు చేసిన‌ప్పుడు అస‌ద్ ఇలాంటి మాట‌లు ఎందుకు చెప్ప‌రు? ఎక్క‌డిదాకానో ఎందుకు.. ఆ మ‌ధ్య జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల వేళ‌లో త‌న‌కు మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించే అధికార టీఆర్ ఎస్ కు చెందిన ఉప ముఖ్య‌మంత్రి ఇంటి మీద‌నే మ‌జ్లిస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌టాన్ని మ‌ర్చిపోలేం. నీతి మాట‌లు చెప్ప‌టానికి.. చేత‌ల్లో చూప‌టానికి మ‌ధ్య అంత‌రం ఎంత‌న్న‌ది అస‌ద్ లాంటోళ్ల‌ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News